కొండాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం.. 108 ద్వారా ఆసుపత్రికి తరలింపు
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి
రుద్రూర్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం కొండాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోటగిరి మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల స్కూల్ వ్యాన్ ఢీకొనడంతో సాయిలు అనే వ్యక్తి గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో వెళ్తున్న సాయిలును ప్రైవేట్ పాఠశాలకు చెందిన వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గ్రామ సర్పంచ్‌కు సమాచారం అందించారు. సర్పంచ్ చొరవతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై గ్రామ సర్పంచ్‌ను వివరణ కోరగా, కోటగిరికి చెందిన ప్రైవేట్ పాఠశాల వ్యాన్ ఢీకొనడం వల్లే సాయిలుకు గాయాలయ్యాయని, వెంటనే 108 అంబులెన్స్‌ను పిలిపించి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
పాఠశాల వాహనాల భద్రతపై పర్యవేక్షణ ఏది?
విద్యార్థుల రవాణా కోసం విని
యోగించే ప్రైవేట్ పాఠశాల వాహనాలు రహదారులపై ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వాహనాల ఫిట్నెస్, డ్రైవర్ల అర్హతలు, వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల అమలుపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తీరుపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







