బ
సంప్రదాయ దుస్తుల్లో సందడి చేసిన విద్యార్థినులు.. రంగురంగుల పూలతో బతుకమ్మల పేర్పు…
బోధన్, అక్టోబర్ 09: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు బోధన్ పట్టణంలోని లయోలా హైస్కూల్‌లో అంబరాన్నంటాయి. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పాఠశాలలో శుక్రవారం ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, బంతి తదితర పూలతో అందమైన బతుకమ్మలను పేర్చారు. అనంతరం బతుకమ్మలను, గౌరమ్మను పూజించి నైవేద్యాలు సమర్పించారు.
పూజల అనంతరం విద్యార్థినులు, ఉపాధ్యాయినులు బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయబద్ధంగా కోలాటాలు ఆడుతూ, జానపద పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. పాఠశాల ప్రాంగణమంతా పూల పరిమళాలు, పాటలు, ఆటలతో పండుగ శోభను సంతరించుకుంది. ఈ వేడుకలు విద్యార్థినుల్లో ఆనందాన్ని నింపడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేలా సాగాయి.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ మాట్లాడుతూ, ప్రకృతిని పూల రూపంలో ఆరాధించే విశిష్టమైన పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో ఈ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బోధన్ ప్రాంత ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








