రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పోటీపడి ధాన్యం కొనుగోలు చేయాలి
రైస్ మిల్లర్లు, రాజకీయ నాయకులు రైతులకు అండగా నిలవాలి: హున్సా విండో చైర్మన్ మందర్న రవి
సాలూర, అక్టోబర్ 08:
రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభిస్తున్న సమయంలో సోషల్ మీడియా వేదికగా రైతులను అయోమయానికి గురిచేసే ప్రచారాలకు తెరదించాలని హున్సా విండో చైర్మన్, రైతు నాయకుడు మందర్న రవి అన్నారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించకుండా రైస్ మిల్లర్లు, రాజకీయ నాయకులు రైతులకు సహకరించాలని ఆయన కోరారు.
గురువారం హున్సా రైతు వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందర్న రవి మాట్లాడారు. కొందరు వ్యక్తులు రాజకీయ ఉద్దేశాలతోనా, వ్యక్తిగత ప్రయోజనాలతోనా సోషల్ మీడియాలో రైతులకు నష్టం కలిగించే విధంగా వీడియోలు, ప్రచారాలు చేయడం సరికాదన్నారు. రైతులు అరువైకాలం కష్టపడి పండించిన పంటకు మంచి ధర లభించేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ మంచి ధర అందించేందుకు పోటీ పడుతున్నారని, అలాంటి సమయంలో రైస్ మిల్లర్లు కూడా ప్రైవేట్ వ్యాపారులతో పోటీపడి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. రైతుకు ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడ తన పంటను విక్రయించుకునే అవకాశం కల్పించాలని కోరారు.

“రైతు కష్టాన్ని రాజకీయాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు బలిచేయొద్దు.రైతుకు లాభం చేకూరే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలి” అని మందర్న రవి అన్నారు.
గతంలో సాలూర మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతాల్లో వరదలు, అకాల వర్షాల కారణంగా రైతులు రెండు, మూడు పంటలను పూర్తిగా నష్టపోయారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే రైతులు కోలుకుంటున్నారని, ప్రస్తుత పంటకు మంచి ధర లభించడం కొంతమేర రైతులకు ఊరటనిస్తోందన్నారు.
రైతులకు నష్టం కలిగించే విధంగా సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే రైతులతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.
రైతు కష్టాన్ని గుర్తించి.. రైతు పంటకు విలువ ఇచ్చి.. రైతు కుటుంబానికి అండగా నిలవాలని రైస్ మిల్లర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారులను మందర్న రవి కోరారు…..

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న హున్సా విండో చైర్మన్ మందర్న రవి.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







