-- --

ఒకే ఊరు.. ఒకే గణపతి!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఆరు దశాబ్దాల ఐక్యతకు భోసి ‘కర్ర గణేశుడు’ సజీవ సాక్ష్యం

నేడే శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుని ప్రతిష్ఠాపన

1963 నుంచి కొనసాగుతున్న అరుదైన సంప్రదాయం.. ఊరంతా ఒక్కటై ఉత్సవాలు

తానూర్, సెప్టెంబర్ 13:
వీధికో వినాయక మండపం.. వాడకో గణపతి ప్రతిమ కనిపించే నేటి రోజుల్లో నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామం మాత్రం భిన్నమైన సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తోంది. గ్రామమంతా కలిసి ఒకే గణపతిని ప్రతిష్ఠించి, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న భోసి గ్రామంలో 1963 నుంచి కొనసాగుతున్న ఈ ‘ఒకే ఊరు–ఒకే గణపతి’ సంప్రదాయం నేటికీ నిరాటంకంగా కొనసాగుతోంది.

అరుదైన ‘కర్ర గణేశుడు’

సాధారణంగా ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అయితే భోసి గ్రామంలో మాత్రం 1963లో ప్రత్యేకంగా చెక్కించిన కర్ర వినాయక విగ్రహాన్నే ఏటా ప్రతిష్ఠించి పూజించడం విశేషం. ఏడాది పొడవునా ఆలయంలో భద్రంగా ఉంచే స్వామివారి విగ్రహాన్ని గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా బయటకు తీసి వైభవంగా ప్రతిష్ఠిస్తారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భోసి గ్రామస్తులతో పాటు పొరుగు ప్రాంతాలు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

దీక్షల స్వీకరణతో భక్తిమయ వాతావరణం

గణేష్ నవరాత్రుల సందర్భంగా గ్రామస్తులంతా ఒకే కుటుంబంలా కలిసిపోతారు. భక్తులు సామూహికంగా గణపతి దీక్షలు స్వీకరించి, ఉదయం–సాయంత్రం జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మాలధారులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పూజా కార్యక్రమాల్లో భాగస్వాములవుతారు. దీంతో 11 రోజుల పాటు గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.

వరసిద్ధుడి కృపతో అభివృద్ధి చెందుతున్న గ్రామం!

తమ గ్రామాభివృద్ధికి శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులే కారణమని స్థానికులు విశ్వసిస్తున్నారు. ఒకప్పుడు వ్యవసాయంపైనే ప్రధానంగా ఆధారపడిన భోసి గ్రామంలో ప్రస్తుతం 130 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. స్వామివారి ఆశీస్సులతో విద్యార్థులు ఉన్నత విద్య, వైద్య, ఐఐటీతో పాటు వివిధ పోటీ పరీక్షల్లో రాణిస్తున్నారని వారు పేర్కొంటున్నారు.

ఐక్యతే భోసి ప్రత్యేకత

ఒకే గణపతిని ప్రతిష్ఠించి గ్రామమంతా కలిసి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా భోసి ప్రజలు ఐక్యతకు చక్కటి ఉదాహరణగా నిలుస్తున్నారు. కుల, వర్గ, రాజకీయ భేదాలకు అతీతంగా అందరూ ఒక్కటై గణనాథుడిని కొలవడం ఈ సంప్రదాయానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తోంది.

నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో భోసి గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ ఏడాది కూడా ‘ఒకే ఊరు.. ఒకే గణపతి’ నినాదంతో శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు.

“ఐకమత్యమే మహాబలం.. కలిసుంటే కలదు బలం!”

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more