-- --

బోధన్‌లో నకిలీ మీసేవ సర్టిఫికెట్ల తయారీ గుట్టురట్టు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఇద్దరు నిందితుల అరెస్ట్‌.. ల్యాప్‌టాప్‌, కలర్‌ ప్రింటర్‌, నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం

బోధన్: బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో నకిలీ ప్రభుత్వ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాకాసిపేట్ పెద్ద మసీదు సమీపంలోని సహారా మీసేవ కేంద్రంలో తనిఖీలు నిర్వహించగా నకిలీ మీసేవ సర్టిఫికెట్లు, నకిలీ టీసీలు, బోనఫైడ్‌ సర్టిఫికెట్లు, రబ్బర్‌ స్టాంప్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు లభించినట్లు నిజామాబాద్ పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య ఐపీఎస్‌ వెల్లడించారు.

పోలీసుల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ సీసీఎస్‌ ఏసీపీ శ్రీశైలం ఆధ్వర్యంలో సీసీఎస్‌, బోధన్ పోలీస్‌ సిబ్బంది సంయుక్తంగా సహారా మీసేవ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీసేవ ఆపరేటర్‌ షేక్‌ వసీమ్‌ (32), కేంద్రం యజమాని మహమ్మద్‌ ముక్రమ్‌ (36)లను అదుపులోకి తీసుకున్నారు.

గత కొంతకాలంగా నకిలీ మీసేవ ధ్రువపత్రాలను తయారు చేసి, వాటిపై సంబంధిత రబ్బర్‌ స్టాంపులు వేసి అసలైన సర్టిఫికెట్ల మాదిరిగా అందిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసి పంచుకునేవారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నకిలీ ధ్రువపత్రాలను ఉపయోగించి ప్రభుత్వ పథకాల ద్వారా అక్రమంగా లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నించినట్లు కూడా దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 5 నకిలీ మీసేవ సర్టిఫికెట్లు, గతంలో తయారు చేసి ఇచ్చినట్లు పేర్కొన్న 22 నకిలీ జనన ధృవీకరణ పత్రాల జిరాక్స్‌ కాపీలు, తయారీ కోసం ఉంచిన 38 ఖాళీ మీసేవ సర్టిఫికెట్లు, ఒక రబ్బర్‌ స్టాంప్‌, 13 నకిలీ టీసీ, బోనఫైడ్‌ సర్టిఫికెట్లు, షాదీ ముబారక్‌కు సంబంధించిన ఒక నకిలీ జిరాక్స్‌ కాపీని స్వాధీనం చేసుకున్నారు.

అలాగే నకిలీ ధ్రువపత్రాల తయారీలో ఉపయోగించిన ఒక హెచ్‌పీ ల్యాప్‌టాప్‌, ఒక క్యానన్‌ కలర్‌ ప్రింటర్‌, ఇద్దరు నిందితుల సెల్‌ఫోన్లు రెండు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్నట్లు పేర్కొన్న ఇతర నిందితులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పోలీసు సిబ్బందికి అభినందనలు

ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్‌ సీఐ అజయ్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ రాములు, కానిస్టేబుళ్లు అనిల్‌, గంగాప్రసాద్‌, బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌, బోధన్‌ టౌన్‌ సీఐ వెంకట నారాయణ, ఎస్‌ఐ ఎల్‌. రామ్‌, కానిస్టేబుళ్లు గంగారం, శివకృష్ణలను నిజామాబాద్ పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య ఐపీఎస్‌ అభినందించారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more