బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు బీడీ కార్మికుల ర్యాలీ, ధర్నా
బోధన్ మే 25 : బోధన్ పట్టణంలోని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI ) ఆధ్వర్యంలో బీడీ కార్మికులు పెద్ద ఎత్తున బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, ధర్నా చేసి, ఏవో గారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2023లో అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే మేం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీడీ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కట్ ఆఫ్ డేటును తొలగించి పింఛన్ రానటువంటి కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4వేల రూపాయలు ఇస్తామని, 2016 రూపాయలు వస్తున్నవారికి కూడా 4000 రూపాయలు పెంచి ఇస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ నేటికీ ఇవ్వకుండా బీడీ కార్మికులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో మంత్రులు జూన్ రెండు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటనలు చేశారని, కానీ నిన్న గాక మొన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం లో కొత్త పెన్షన్ల ఊసే లేదని వాట్సప్ గ్రూపులలో జిపి లలో మున్సిపాలిటీలలో అప్లై చేసుకోవాలంటూ ప్రచారం చేస్తున్నారని సంబంధిత అధికారులను అడిగితే మాకు పై నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ చెబుతున్నారని ఇలా పొంతన లేని ప్రకటనలతో రాష్ట్రంలోని పించను రానటువంటి ప్రజలు అయోమయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీడీ కార్మికులందరికీ ఇచ్చిన మాట ప్రకారం జూన్ 2 నుండి అయినా కొత్త పింఛన్లను మరియు పాతవారికి 2016 వస్తున్న వారికి కూడా పెంచి 4000 రూపాయల కాడికి ఇవ్వాలని లేనట్లయితే బీడీ కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏరియా కమిటీ నాయకులు గంగామణి, లక్ష్మి,ఇంద్ర, పి ఓ డబ్ల్యు పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి, అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకుడు పడాల శంకర్ మరియు అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.







