-- --

అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

మోపాల్ మండలంలో 425 మందికి చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ….

నియోజకవర్గంలో ఇప్పటికే 6 వేల ఇందిరమ్మ ఇళ్లు

నిజామాబాద్, నవంబర్ 16 (v1news): అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేకుండా, పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి స్పష్టం చేశారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మండలానికి చెందిన 425 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్లలో పేదలకు పూర్తిస్థాయిలో అందని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు. పెన్షన్ల మంజూరులో కొంత ఆలస్యం జరిగినప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పింఛన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. దివ్యాంగులకు నెలకు రూ.4 వేల చొప్పున, ఇతర అర్హులైన లబ్ధిదారులకు రూ.2 వేల చొప్పున పెన్షన్లు అందిస్తున్నట్లు వివరించారు.

పేదల సంక్షేమమే ప్రజా పాలన ప్రభుత్వ ధ్యేయం…

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని, అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు. గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండగా, రైతులకు కూడా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

పేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు 6 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించామని వెల్లడించారు. నియోజకవర్గంలోని ఏ ఒక్క పేద కుటుంబం కూడా గుడిసెల్లో ఉండకూడదన్నదే తమ లక్ష్యమని అన్నారు. అర్హులైన వారికి రాజకీయ పైరవీలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో సేకరించిన ప్రభుత్వ నిధులను తిరిగి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం

రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు సుమారు రూ.79 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 150కి పైగా మహిళా సంఘ భవనాలను మంజూరు చేయించామని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల రూపకల్పనతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధితో గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ధాన్యం క్వింటాల్‌కు రూ.3 వేల కంటే తక్కువకు విక్రయించవద్దు

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం వరి ధాన్యానికి మంచి ధర లభిస్తున్న నేపథ్యంలో రైతులు తొందరపడి క్వింటాల్‌కు రూ.3 వేల కంటే తక్కువ ధరకు విక్రయించవద్దని సూచించారు. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.

రైతును రాజు చేయడమంటే మాటల్లో చెప్పడం కాదని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి వారి కుటుంబాల్లో ఆర్థిక భరోసా, సంతోషం నింపడమేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని వివరించారు.

ఎల్‌నినో ప్రభావం.. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి

ఎల్‌నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. భూగర్భ జలమట్టాలు తగ్గుతున్నందున అందుబాటులో ఉన్న నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. రెండో పంటగా వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలి

2047 రైజింగ్ తెలంగాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంటే బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సుమారు రూ.30 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరినప్పటికీ ఆశించిన స్పందన రావడం లేదన్నారు. స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

ప్రతి 15 రోజులకు ఒకసారి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ విమర్శలు చేయడం కంటే రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. ప్రతిపక్షాల విమర్శలకు తాము ప్రాధాన్యత ఇవ్వబోమని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని స్పష్టం చేశారు.

చివరిగా చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు అందుకున్న 425 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మోపాల్ మండల అధ్యక్షుడు రవి, పార్టీ నాయకులు జలంధర్ రెడ్డి, యాదగిరి, డీఆర్‌డీఓ పీడీ సాయన్న, మండల ప్రత్యేక అధికారి ప్రసాద్, ఎంపీడీఓ, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more