-- --

సహారా బాధితుల కన్నీళ్లు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

13 కోట్ల మంది ఖాతాదారుల భవిష్యత్తు ప్రశ్నార్థకం..

రీఫండ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు…
ప్రతి డిపాజిటర్‌కు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు చేపట్టాలి:…
సహారా బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. బాలయ్య….

ధర్పల్లి, నవంబర్ 16 :- రెక్కలు ముక్కలు చేసుకుని, రోజంతా కష్టపడి పని చేసి సంపాదించిన ప్రతి రూపాయిని భవిష్యత్తులో తమ కుటుంబానికి ఆసరాగా ఉంటుందని నమ్మి సహారా ఇండియా సంస్థలో పొదుపు చేసుకున్న పేద, మధ్య తరగతి ప్రజల ఆశలు అడియాశలవుతున్నాయి. తమ కష్టార్జిత సొమ్ము తిరిగి వస్తుందని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కోట్లా మంది ఖాతాదారుల ఆవేదనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సహారా బాధితుల మరియు కార్యకర్తల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. బాలయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ధర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సహారా బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వి. బాలయ్య మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది పేద, మధ్య తరగతి ప్రజలు రోజు వారీ కూలి పనులు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ సంపాదించిన సొమ్మును భవిష్యత్తులో పిల్లల చదువులు, వివాహాలు, కుటుంబ అవసరాలు, వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాయనే ఆశతో సహారా ఇండియా సంస్థలో డిపాజిట్ చేశారని తెలిపారు. అయితే సంస్థ నుంచి డిపాజిట్ సొమ్ము తిరిగి అందక పోవడంతో లక్షలాది కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఉపయోగ పడుతుందని దాచుకున్న డబ్బులే ఇప్పుడు అందుబాటులో లేక పోవడంతో బాధితులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

నాలుగు కోట్ల దరఖాస్తులు.. అందింది కొందరికే!

2023లో కేంద్ర హోంశాఖ మంత్రి సహారా రీఫండ్ పోర్టల్‌ను ప్రారంభించి, బాధితులు ఆన్‌లైన్ ద్వారా తమ డిపాజిట్ల రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారని బాలయ్య గుర్తు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల మంది ఖాతాదారులు ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటి వరకు సుమారు 50 లక్షల మందికి మాత్రమే రూ.9,700 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు తెలిపారు. మిగిలిన బాధితులకు తమ సొమ్ము ఎప్పుడు అందు తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రీఫండ్ ప్రక్రియలో జాప్యం కారణంగా బాధితులు కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

డబ్బులు అందక ఆగుతున్న చదువులు.. నిలిచిపోతున్న పెళ్లిళ్లు!

సహారాలో దాచుకున్న సొమ్ము తిరిగి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న బాధితుల హృదయాలలో చాలా మంది వృద్ధులు, నిరు పేదలు ఉన్నారని తెలిపారు. పిల్లల ఉన్నత చదువులు, కుమార్తెల వివాహాలు, కుటుంబ వైద్య ఖర్చుల కోసం దాచుకున్న డబ్బులు అందక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. వృద్ధాప్యంలో తమకు ఆర్థిక భద్రతగా ఉంటుందని పొదుపు చేసుకున్న సొమ్ము చేతికి అందక వృద్ధులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తిరిగి వస్తాయనే ఆశతో ఎదురుచూస్తూ ఇప్పటి వరకు పది వేలకు పైగా బాధితులు మరణించారని, మరి కొందరు ఆర్థిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు.

పేదల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే!

పేదల సంక్షేమమే తమ లక్ష్యమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, కోట్లాది మంది సామాన్య ప్రజల కష్టార్జిత సొమ్ము విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బాలయ్య ప్రశ్నించారు. బాధితుల సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో సహారా సంస్థ ఆస్తులను మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు ఆదానీకి అప్పగించేలా కుట్ర పూరిత ఆలోచనలు జరుగుతున్నాయంటూ ఆయన ఆరోపించారు. పేదల డిపాజిట్లను తిరిగి చెల్లించడమే ప్రాధాన్యతగా తీసుకోవాలని, ఆస్తుల విక్రయాలు లేదా ఇతర చర్యల వల్ల బాధితుల ప్రయోజనాలకు నష్టం కలగ కుండా చూడాలని కోరారు.

ప్రతి ఖాతాదారుడికి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం!

కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కాలయాపన చేయ కుండా సహారా రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని బాలయ్య డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఖాతాదారుడికి వారి డిపాజిట్ సొమ్మును అందించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. రీఫండ్ చెల్లింపుల పై స్పష్టమైన గడువు ప్రకటించాలని, సాంకేతిక కారణాలతో దరఖాస్తులు తిరస్కరణకు గురైన బాధితులకు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు.

పేదలు, మధ్య తరగతి ప్రజలు జీవిత కాలం కష్ట పడి కూడ బెట్టుకున్న సొమ్మును తిరిగి అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడి చేలా తక్షణమే యుద్ధ ప్రాతి పదికన చర్యలు చేపట్టాలని సహారా బాధితుల మరియు కార్యకర్తల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. బాలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి బాధితుడికి న్యాయం జరిగే వరకు తమ సంఘం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more