వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ఎంపిక.. నీటి పొదుపు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన..
బోధన్, నవంబర్ 6: నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏటీఎంఏ (ATMA) ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్పీఎల్ (RPL) కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేయడంతో పాటు, శాస్త్రవేత్తల అనుభవాలు, పరిశోధన ఫలితాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేలా రైతులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, వర్షపాతం అస్థిరత, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి పరిస్థితులు వ్యవసాయ రంగంపై చూపే ప్రభావాలను వివరించారు. రానున్న సాగు సీజన్లో వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకుని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవడం, నీటి వినియోగంలో పొదుపు పాటించడం, తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం, నేలలో తేమను కాపాడుకునే పద్ధతులు అవలంబించడం వంటి అంశాలపై రైతులకు పలు సూచనలు అందించారు. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరించడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.

వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు అందించే సలహాలు, సూచనలను రైతులు పాటించాలని, ఆధునిక సాగు పద్ధతులను అందిపుచ్చుకుని అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏటీఎంఏ పీడీ డైరెక్టర్ తిరుమల ప్రసాద్, గ్రామ సర్పంచ్ సోక్కం లావణ్య రవి, అల్లె రమేష్, బోధన్ ఏడీఏ శ్రీనివాస్, ఎంఏఓ శ్వేత, ఏఈవోలు ముజామిల్, ఉమా, రుద్రూర్ కేవీకే శాస్త్రవేత్త ఇంధుధర్ రెడ్డి, జగిత్యాల ప్రిన్సిపల్ ప్రతినిధులు సౌజన్య, అర్చన తదితరులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







