హున్సా ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభం.. గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం…
బోధన్, నవంబర్ 6 (వి1 న్యూస్): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు విద్యార్థుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ హున్సా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా సాలూర మండలం హున్సా గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.
కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన ‘గ్రోమోర్ గ్రామం’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ మర్కల్ శివకుమార్ రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్ను ప్రారంభించగా, సంస్థ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గ్రోమోర్ గ్రామం కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సందేశమిచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగిస్తూ నీటి సంరక్షణకు బాధ్యతగా వ్యవహరిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు అల్పాహారం అందించారు.

హున్సా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతో పాటు గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు సొసైటీ చైర్మన్ మందర్న రవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల గ్రామమైన హున్సాను దత్తత తీసుకుని విద్య, తాగునీరు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.
కార్పొరేట్ సంస్థలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములైతే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు దోహదపడుతుందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ మాజీ చైర్మన్ శీల శంకర్, జోనల్ మేనేజర్ సజ్జన్ కుమార్, సంస్థ ప్రతినిధులు, సొసైటీ వైస్ చైర్మన్ వినోద్ బాబా, సొసైటీ సీఈవో అనిల్ పటేల్, ఉపసర్పంచ్ నగేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమా, మాజీ ఎంపీటీసీ శివకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







