-- --

రైతులకు విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టతనివ్వాలి..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాగు విస్తీర్ణం నిర్ణయించుకునేలా ముందస్తు ప్రకటన చేయాలి.. బీఆర్‌ఎస్ నేత ఇల్తెపు గంగారం డిమాండ్…

బోధన్, నవంబర్ 6 (V1 న్యూస్): ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో రైతులు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారని, అయితే వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని సాలూర మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమ నేత ఇల్తెపు గంగారం డిమాండ్ చేశారు.

శుక్రవారం సాలూర మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే పంట కాలంలో ఎన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తారో ప్రభుత్వం ముందుగానే ప్రకటించాలని కోరారు. విద్యుత్ సరఫరాపై స్పష్టత ఉంటేనే రైతులు తమకున్న భూమి, నీటి వనరులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను బట్టి ఎన్ని ఎకరాల్లో ఏ పంట సాగు చేయాలనే నిర్ణయం తీసుకోగలరని పేర్కొన్నారు.

 

రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ సొంత పార్టీ నాయకులే గతంలో చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్నాయని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా విషయంలో రైతులు ప్రభుత్వాన్ని ఎలా విశ్వసించాలని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారుల ఇళ్లలో ఏసీలు, ఫ్రిజ్‌లు తదితర విద్యుత్ ఉపకరణాల వినియోగాన్ని తగ్గించుకుని, రైతుల వ్యవసాయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరోవైపు పంటల సాగుపై ఆంక్షలు విధించడం రైతులను అయోమయానికి గురిచేస్తోందని విమర్శించారు. పంటలు పండించడం ఒక సవాలుగా మారిన సమయంలో పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవడం కూడా చిన్న, సన్నకారు రైతులకు భారంగా మారిందన్నారు. అనేక మంది రైతుల ధాన్యం కొనుగోలు కోసం రోడ్లపైనే ఎదురుచూస్తుండగా, దళారులు పెద్ద రైతుల ధాన్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతోందని తెలిపారు.

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితం చేయకుండా, ప్రతి చిన్న, సన్నకారు రైతు ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి, అర్హులైన రైతులకు ప్రకటించిన బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే బీఆర్‌ఎస్ పార్టీ రైతులతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వెనుకాడబోదని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సాలూర గ్రామ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చందూర్ సాయిరెడ్డి, నాయకులు ముత్స్యల దత్తాద్రి, కన్నె పోశెట్టి, ఎల్మ దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more