-- --

భూ భారతి రీ సర్వేతో రైతులకు భూమిపై భరోసా

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఎరాజ్‌పల్లిలో గ్రామసభలో పాల్గొన్న బోధన్ ఆర్డీవో విజయకుమారి

శాటిలైట్ సర్వే, అధునాతన రోవర్ సర్వే ప్రయోజనాలపై రైతులకు అవగాహన…

బోధన్: భూ భారతి చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ ఆర్డీవో శ్రీమతి ఎం. విజయకుమారి సూచించారు. బోధన్ మండలం ఎరాజ్‌పల్లి గ్రామంలో నిర్వహించిన భూ భారతి రీ సర్వే గ్రామసభలో ఆమె పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. భూ భారతి రీ సర్వే ద్వారా భూముల సరిహద్దులను కచ్చితంగా నిర్ధారించడం, భూ రికార్డుల్లో పారదర్శకతను పెంపొందించడం, భూ వివాదాలను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే శాటిలైట్ సర్వే, అధునాతన రోవర్ సర్వే విధానాల ద్వారా భూముల కొలతలను మరింత కచ్చితత్వంతో నమోదు చేసే అవకాశం ఉంటుందని వివరించారు.

సర్వే నిర్వహించే విధానం, భూముల సరిహద్దుల నిర్ధారణ, సర్వే అనంతరం రైతులు తమ అభ్యంతరాలు, అభ్యర్థనలు తెలియజేసే ప్రక్రియపై అధికారులు గ్రామసభలో వివరించారు. భూ భారతి చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం రైతులకు అందుబాటులో ఉన్న అవకాశాలను తెలియజేశారు. రీ సర్వే ప్రక్రియలో రైతులు తమ భూములకు సంబంధించిన పత్రాలతో సహకరించాలని, సర్వే సమయంలో తమ భూముల వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.

గ్రామసభలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, బోధన్ తహశీల్దార్, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ డీఐఓలు, గ్రామ సర్పంచ్, పీఏసీఎస్ చైర్మన్, ఉప సర్పంచ్, బోధన్ మండల సర్వేయర్, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, గ్రామ పెద్దలు, రైతులు, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

రైతులకు భూమిపై స్పష్టమైన హక్కులు, భూ రికార్డుల్లో పారదర్శకత కల్పించడమే భూ భారతి రీ సర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more