నలుగురు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక.. ఎంఐఎం కౌన్సిలర్ల బహిష్కరణ
బోధన్, జూన్ 30: బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పూర్తి పారదర్శకత మధ్య నిర్వహించారు. బోధన్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది.
ప్రభుత్వ సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 39 మంది సభ్యులకు గాను 39 మంది హాజరై కోరంను పూర్తి చేశారు. అనంతరం ఆయా కేటగిరీలకు వచ్చిన ప్రతిపాదనలను చదివి వినిపిస్తూ, చేతులు ఎత్తే విధానంలో ఓటింగ్ నిర్వహించారు.
ప్రిసైడింగ్ అధికారి ఎన్నికల ప్రక్రియను ప్రకటించిన అనంతరం ఎంఐఎంకు చెందిన 12 మంది కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనంతరం మిగిలిన సభ్యులతో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది.

నాలుగు కో-ఆప్షన్ సభ్యుల స్థానాలకు మొత్తం 35 దరఖాస్తులు రాగా, మెజారిటీ సభ్యుల (19 మంది) మద్దతుతో దండు సంగ్రామ్, మాసుల లక్ష్మి, మహమ్మద్ ఇమ్రాన్, రఫీయా బేగం కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి జాదవ్ కృష్ణ ప్రకటించారు. అనంతరం వారికి నియామక ధృవీకరణ పత్రాలను అందజేశారు.
ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులను ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి. భుజంగరావు, బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








