బోధన్, జూన్ 15: ఉపాధి హామీ పథకం (నరేగా) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వీబీజీఆర్‌ఎంజీ–2025 (VBGRMG-2025) అమలును వ్యతిరేకిస్తూ జూలై 1న దేశవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య తెలిపారు.
సోమవారం బోధన్ పట్టణంలోని గ్రామ అభివృద్ధి కమిటీ కమ్యూనిటీ హాల్‌లో ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు గైని రాములు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో వికలాంగుల ఉపాధి, జీవనోపాధికి నరేగా పథకం ఉపయోగపడిందని, దానికి బదులుగా తీసుకొస్తున్న కొత్త విధానం వల్ల గ్రామీణ వికలాంగులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నరేగా సంఘర్షణ మోర్చాతో కలిసి వీబీజీఆర్‌ఎంజీ–2025 రద్దు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు.

వికలాంగుల హక్కుల చట్టం అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల వికలాంగులు రిజర్వేషన్ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. వికలాంగుల పెన్షన్‌ను రూ.4,016 నుంచి రూ.6,000కు పెంచుతామని ప్రకటించి అమలు చేయకపోవడం, కొత్త చేయూత పెన్షన్ల మంజూరులో జాప్యం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే, వికలాంగుల హక్కుల చట్టాలు, సంక్షేమ పథకాలపై జూలై 25, 26 తేదీల్లో బోధన్ పట్టణంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని, సదస్సును విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి యేశాల గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ నజీర్, నాయకులు నాగనాథ్ పటేల్, గంగారాం, లక్ష్మణ్ సింగ్, రాజు, భూమయ్య, సద్దాం తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







