-- --

నేరాల నియంత్రణలో నిర్లక్ష్యానికి తావులేదు!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

డ్రగ్స్, సైబర్ నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి

పాత నేరస్థులపై నిరంతర నిఘా.. అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు

నవంబర్ 25 నుంచి 28 వరకు రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్…

నిజామాబాద్, నవంబర్ 10:

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, అక్రమ పేకాట, గుట్కా వ్యాపారం, ఇసుక అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తూ అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగించాలని స్పష్టం చేశారు.

మంగళవారం జన్కంపేట్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో ఆయన సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిధిలో నమోదైన కేసుల పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారం, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలకు పటిష్ట ఏర్పాట్లు

నవంబర్ 25 నుంచి 28 వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించనున్న ఐదవ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు కార్యక్రమాలకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కమిషనర్ సూచించారు. వివిధ జిల్లాల నుంచి హాజరయ్యే క్రీడాకారులు, అధికారులు, ముఖ్య అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి, రవాణా, భద్రత, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రతిష్టను నిలబెట్టాలని పేర్కొన్నారు.

డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు ప్రత్యేక దాడులు నిర్వహించాలని తెలిపారు. ఈ అక్రమ వ్యాపారాల్లో పాల్గొనే వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులు, యువత, ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి అవసరమైన సహాయం అందించాలని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పాత నేరస్థులపై నిరంతర నిఘా

హత్యలు, హత్యాయత్నాలు, దొంగతనాలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారం తదితర కేసులను సమీక్షిస్తూ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్‌పై విడుదలైన నిందితుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి గస్తీని బలోపేతం చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు.

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత

మహిళలు, బాలికల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని కమిషనర్ స్పష్టం చేశారు. షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కమిషనర్ ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారులను కలిపే లింక్ రోడ్ల వద్ద అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, రహదారులకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను గుర్తించి నేషనల్ హైవే, స్టేట్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో పాటు అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ల వాహన చోదకత్వం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై విస్తృత అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు.

డయల్ 112పై ప్రజలకు అవగాహన కల్పించాలి

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు పోలీసుల సహాయం పొందేందుకు డయల్ 112 సేవలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఈ సేవల గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని, 24 గంటల పాటు వాహనాల తనిఖీలు చేపట్టే సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

ప్రజలకు పోలీస్ స్టేషన్లలో మెరుగైన సేవలు

పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని కమిషనర్ సూచించారు. స్టేషన్లలో రిసెప్షన్ నిర్వహణ, రికార్డుల భద్రత, పరిశుభ్రత, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తరించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపునకు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆర్. అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more