రైస్ మిల్లును లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. పోలీసులకు ఫిర్యాదు
ఇటీవల ఎత్తిపోతల పథకం ట్రాన్స్ఫార్మర్లోనూ చోరీ.. వరుస ఘటనలతో ఆందోళన..
బోధన్, అక్టోబర్ 31 : బోధన్ మండల కేంద్రంలోని శ్రీ సాయి లక్ష్మీ ఆగ్రో ఇండస్ట్రీస్ (రైస్ మిల్)కు చెందిన ట్రాన్స్ఫార్మర్ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, అందులోని ఆయిల్‌తో పాటు విలువైన కాపర్ వైర్లను చోరీ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
రైస్ మిల్లుకు చెందిన ట్రాన్స్ఫార్మర్ను పూర్తిగా ధ్వంసం చేసి, అందులోని ఆయిల్, కాపర్ తీగలను అపహరించినట్లు మిల్లు యజమాని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి విలువైన సామగ్రిని దొంగిలించడంతో మిల్లుకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఇటీవల సాలూర–మంజీరా రోడ్డులోని ఎత్తిపోతల పథకానికి చెందిన ట్రాన్స్ఫార్మర్ ఆయిల్‌ను కూడా దుండగులు చోరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా రైస్ మిల్లులో చోటుచేసుకున్న చోరీతో మండలంలో ట్రాన్స్ఫార్మర్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి ఆయిల్, కాపర్ వైర్లను చోరీ చేయడం వల్ల సంబంధిత సంస్థలకు ఆర్థిక నష్టంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, చోరీలకు పాల్పడుతున్న దుండగులను గుర్తించి పట్టుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







