### భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలి….

బోధన్, అక్టోబర్ 31 (ఆర్.కే. న్యూస్): ఎనీనో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, సాగునీటి లభ్యత తగ్గే అవకాశాలున్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జాడి సొసైటీ చైర్మన్ మల్లవరపు సుందర్ రాజు సూచించారు. భూసార పరిరక్షణతో పాటు తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

శనివారం జాడి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పద్ధతులు, భూసార పరిరక్షణ, ఎనీనో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్ రాజు మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు విధానాలను మార్చుకోవాలని, ప్రభుత్వ సూచనల మేరకు యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయడానికి ముందుకు రావాలని కోరారు.
### వరికి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు
సాగునీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరికి బదులుగా మొక్కజొన్న, కుసుమ, కంది, మినుము, పెసర వంటి పంటలను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపాలని సూచించారు. ఆరుతడి పంటల సాగుతో నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు భూసారాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.
ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందించాలని, ఉద్యాన శాఖ ద్వారా విత్తనాలు, నార్లు, మల్చింగ్ సదుపాయాలను కల్పించాలని రైతులు కోరారు. అలాగే వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేసేందుకు అవసరమైన మొక్కజొన్న, కుసుమ, కంది, మినుము, పెసర విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఒక్కో రైతుకు ఒక బస్తా విత్తనాలు మాత్రమే ఇవ్వకుండా, సాగు విస్తీర్ణానికి అనుగుణంగా అవసరమైనన్ని విత్తనాల బ్యాగులను అందించాలని కోరారు. దీనిపై వ్యవసాయ అధికారులు స్పందిస్తూ.. రైతుల విజ్ఞప్తులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
### సకాలంలో జీలుగ విత్తనాలు అందించాలి
జీలుగ విత్తనాలను ఏప్రిల్, మే నెలల్లోనే పంపిణీ చేయాలని రైతులు కోరారు. జూన్, జూలై నెలల్లో విత్తనాలు అందించడం వల్ల ప్రయోజనం ఉండటం లేదని పేర్కొన్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు స్పందిస్తూ.. ఏప్రిల్, మే నెలల్లోనే జీలుగ విత్తనాలు అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోగినేని జ్యోతి, ఉద్యాన శాఖ అధికారి వాహిద్ హుస్సేన్, వ్యవసాయ విస్తరణ అధికారి ఉమా, గ్రామ రైతులు పాల్గొన్నారు.

రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతున్సొసైటీ చైర్మన్ మల్లవరపు సుందర్ రాజు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







