పదవీ విరమణ చేసిన నలుగురు పోలీసు సిబ్బందికి సన్మానం నిష్కళంక సేవలు అందించడం అభినందనీయం: సీపీ పి. సాయి చైతన్య…
నిజామాబాద్, అక్టోబర్ 31 ): పోలీసు శాఖలో దశాబ్దాలపాటు అంకితభావంతో పనిచేసి, ఎలాంటి మచ్చ లేకుండా పదవీ విరమణ పొందడం ఎంతో గొప్ప విషయమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ పేర్కొన్నారు. అక్టోబర్ నెలలో పదవీ విరమణ పొందిన నలుగురు పోలీసు సిబ్బందికి శనివారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

36 నుంచి 37 ఏళ్ల సుదీర్ఘ సేవలు పదవీ విరమణ పొందిన వారిలో ఏఎస్ఐ టి. శ్రీనివాస్ గౌడ్ (టౌన్-5 పీఎస్), ఏఎస్ఐ శీలంపల్లి వెంకటేశ్వర్ (నవీపేట్ పీఎస్), ఏఎస్ఐ అబ్దుల్ హమీద్ ఖాన్ (టౌన్-3 పీఎస్), హెడ్ కానిస్టేబుల్ నీలి శేఖర్ (పోలీస్ కంట్రోల్ రూమ్) ఉన్నారు. వీరిలో శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్, నీలి శేఖర్ 36 ఏళ్ల చొప్పున, అబ్దుల్ హమీద్ ఖాన్ 37 ఏళ్లపాటు సుదీర్ఘంగా సేవలందించి శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు.
పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: సీపీ
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ఎంతో పని ఒత్తిడి ఉండే పోలీస్ శాఖలో క్రమశిక్షణతో విధులు నిర్వహించి సగౌరవంగా పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు. ఉద్యోగులకు పదవీ విరమణ సహజ ప్రక్రియే అయినప్పటికీ, వారు సంస్థకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా ఏ అవసరం వచ్చినా పోలీస్ శాఖ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. విశ్రాంత సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, కార్యాలయ సూపరింటెండెంట్లు శంకర్, ఎ. జగతి, టి. వనమాల, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణి కుమార్, ఎస్. శేఖర్ బాబు, ఎంటీవో, హోంగార్డ్స్ విభాగాల అధికారులు, విశ్రాంత సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







