…ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోండి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య….
నిజామాబాద్, అక్టోబర్ 26 (ప్రతినిధి): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని చట్టప్రకారం పరిష్కరించేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు. సోమవారం నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 39 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా విన్న పోలీస్ కమిషనర్, వాటిని చట్టప్రకారం పరిశీలించి పరిష్కరించేలా సంబంధిత పోలీసు అధికారులకు సూచనలు చేశారు. కొన్ని ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సీఐలతో ఫోన్లో మాట్లాడి సమస్యల ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పైరవీలు లేకుండా పోలీసు సేవలు పొందాలి..
ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మూడో వ్యక్తుల ప్రమేయం లేదా పైరవీలు లేకుండానే పోలీసు సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసుల దృష్టికి తీసుకువచ్చి, చట్టపరమైన పరిష్కారం పొందేలా పోలీసు శాఖ ప్రజలకు మరింత చేరువ కావాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్పష్టం చేశారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







