సాలూర మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతాలు అయిన తెగ్గెలి, ఖాజాపూర్, హుంసా, మందర్ణ గ్రామాల పరిసరాల్లో రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణా బహిరంగంగా కొనసాగుతుందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ, ప్రకృతి సంపదను కొల్లగొడుతూ ఇసుక మాఫియా యథేచ్ఛగా వ్యవహరిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు మాత్రం మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది.

స్థానికుల సమాచారం ప్రకారం, కొందరు అధికారులే వాహన యజమానులకు రహస్యంగా సమయాలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు, మళ్లీ తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ట్రాక్టర్లు, ఆటోలు, బొలెరో వాహనాల ద్వారా భారీగా ఇసుక తరలింపులు జరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఈ సమయాల్లో పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ రవాణాదారులు దర్జాగా తిరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇంత బహిరంగంగా దందా సాగుతున్నా చెక్‌పోస్టులు మాత్రం నామమాత్రంగా మారిపోయాయని ప్రజలు మండిపడుతున్నారు. కొంతమంది కింది స్థాయి అధికారులు కేవలం పేరుకే తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని, వారి ముందుగానే ఇసుక వాహనాలు వెళ్లినా చూడనట్టే వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, కొన్ని వాహనాలకు నంబర్ ప్లేట్లు కూడా లేకుండా ఇసుక రవాణా జరుగుతున్నా ఎవరూ అడ్డుకోవడం లేదని చెబుతున్నారు. ఇది చట్టాన్ని ఎగతాళి చేయడమే కాకుండా అధికార వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.
మైనింగ్ శాఖ అధికారులు మాత్రం కనిపించకపోవడం, గతంలో కొరడా ఝళిపించిన అధికారులు ఇప్పుడు ఎక్కడా జాడ లేకపోవడం ప్రజల్లో అనుమానాలను మరింత పెంచుతోంది. “అంతా మామూల్ల పర్వమేనా..?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అక్రమ ఇసుక తవ్వకాల వల్ల మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడం, వ్యవసాయ భూములు దెబ్బతినడం, రహదారులు నాశనం కావడం, ప్రమాదాలు పెరగడం వంటి తీవ్ర ప్రభావాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ చర్యలు లేకపోవడం బాధాకరం.
ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి, అక్రమ రవాణాకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






