5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2026 ముగింపు వేడుకలపై ఐజీ స్పోర్ట్స్ కోచ్‌ల బృందం పర్యవేక్షణ
నిజామాబాద్, నవంబర్ 9:
పండుగ వేళ ప్రజలు ఆనందోత్సాహాలతో గడుపుతుంటే.. ప్రజల భద్రతతో పాటు శాఖాపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పోలీసులు నిరంతరం విధుల్లో నిమగ్నమవుతున్నారు. ప్రజల ప్రశాంతతే లక్ష్యంగా పనిచేస్తూనే, రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల నిర్వహణను కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిజామాబాద్ పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. విధి నిర్వహణలో అంకితభావం, ప్రతి కార్యక్రమంలో క్రమశిక్షణ, సమన్వయానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయం.
నిజామాబాద్ జిల్లాలో నిర్వహించనున్న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2026 ముగింపు వేడుకలను విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐజీ స్పోర్ట్స్ విభాగానికి చెందిన వివిధ క్రీడా విభాగాల కోచ్‌ల బృందం జిల్లాకు చేరుకొని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
వాటర్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, స్విమ్మింగ్, ఆర్చరీ తదితర క్రీడా విభాగాలకు సంబంధించి మైదానాలు, క్రీడా సామగ్రి, సాంకేతిక సదుపాయాలు, భద్రతా చర్యలు, పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను కోచ్‌ల బృందం పరిశీలించింది. ఆయా విభాగాల నిపుణుల సూచనలు, సలహాల మేరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేస్తున్నారు.
ఈ సందర్భంగా సోమవారం ఐజీ స్పోర్ట్స్ విభాగం నుంచి వచ్చిన కోచ్‌ల బృందం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పాల్గొనే క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించాలని, పోటీలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు.
ప్రజల భద్రత నుంచి క్రీడా ప్రాంగణాల నిర్వహణ వరకు.. ప్రతి బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడమే పోలీసుల ప్రత్యేకత. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలు, శాఖాపరమైన బాధ్యతలు ఏవైనా ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తుండటం ప్రశంసనీయం. రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలకు నిజామాబాద్ జిల్లా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషి చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ముడ్ రిజర్వ్ ఏసీపీ శ్రీకృష్ణ, సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ నరేందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణికుమార్, శేఖర్‌బాబు, ఐజీ స్పోర్ట్స్ విభాగం కోచ్‌లు పి. కృష్ణారావు, ఎన్. శ్రీనివాస్, ఎం.డి. బాబా, ఎం. రతన్‌కుమార్, డి. సతీష్, డి. యామన్, ఎం.డి. మోసిన్, బొబ్బిలి నరసయ్య, కృష్ణ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







