ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!
విగ్రహాల ఏర్పాటు నుంచి డీజేల వరకు.. 8 అంశాలపై పోలీసుల ఆంక్షలు
నవంబర్ 1 నుంచి 15 వరకు అమలు.. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లకు వర్తింపు
నిజామాబాద్, అక్టోబర్ 31 (ప్రతినిధి): ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, శబ్ద కాలుష్య నివారణ లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విగ్రహాల ఏర్పాటు, డీజేల వినియోగం, ఊరేగింపులు, బహిరంగ సభలు, డ్రోన్ల వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం తదితర అంశాలపై ఎనిమిది రకాల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్, ప్రజలకు సూచించారు.
ఈ నిబంధనలు నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పోలీస్ డివిజన్ల పరిధిలో అమలులో ఉంటాయని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేసినట్లు పోలీస్ పీఆర్వో వెల్లడించారు.
విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి
ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేయరాదని పోలీసులు స్పష్టం చేశారు. జనసమ్మర్థ ప్రాంతాలు, పార్కులు, రహదారుల మధ్యనున్న ఐలాండ్లు, ప్రభుత్వ భవనాల వద్ద అనుమతి లేకుండా విగ్రహాలను ప్రతిష్ఠించరాదని సూచించారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని పేర్కొన్నారు.
డీజేలపై ఆంక్షలు.. రాత్రి 10 గంటల తర్వాత నిషేధం
అధిక శబ్దంతో డీజేలు, సౌండ్ సిస్టమ్స్ వినియోగించడం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలు, సౌండ్ సిస్టమ్స్ వినియోగం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. నివాస, వాణిజ్య ప్రాంతాల్లో రాత్రివేళ శబ్ద పరిమితులను పాటించాలన్నారు. డీజేలు, లౌడ్ స్పీకర్ల వినియోగానికి పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు.
సభలు, ఊరేగింపులకు ముందస్తు అనుమతి
ఊరేగింపులు, బహిరంగ సభలు, సమావేశాల సందర్భంగా పరిమితులకు మించిన శబ్దం ఉత్పత్తి చేసే డీజేలు, సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదని ఆదేశించారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ఏర్పాటుకు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందాలని సూచించారు.
500 మందితో సమావేశాలు నిర్వహించాలంటే సంబంధిత అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. 500 మందికి పైగా పాల్గొనే కార్యక్రమాలకు కనీసం 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి పొందాలని స్పష్టం చేశారు.
సార్వజనిక ప్రదేశాల్లో భద్రతకు ప్రాధాన్యం
మాల్స్, సినిమా థియేటర్లు, హోటళ్లు, ఎగ్జిబిషన్లు, వాణిజ్య సముదాయాల్లో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. ప్రజలు క్యూలోనే వెళ్లాలని, రద్దీని నియంత్రించేందుకు నిర్వాహకులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి
డ్రోన్ల వినియోగం వల్ల ప్రజల భద్రతకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నందున వాటి వినియోగంపై నియంత్రణ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం డ్రోన్లు వినియోగించాలనుకునే వారు సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పోలీస్, ఏవియేషన్ అధికారుల నుంచి ముందస్తు అనుమతులు, క్లియరెన్స్ పొందాలని సూచించారు.
నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ పాస్పోర్టు, వీసా, రవాణా తదితర సేవల పేరుతో కొందరు నకిలీ గల్ఫ్ ఏజెంట్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలిపారు.
గల్ఫ్ ఏజెంట్లకు ఇళ్లను అద్దెకు ఇచ్చే ముందు వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు అద్దెకు వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్కు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
మైనర్లకు ‘ఎ’ సర్టిఫికెట్ సినిమాలు నిషేధం
‘ఎ’ (అడల్ట్స్) సర్టిఫికెట్ పొందిన సినిమాలను మైనర్లు వీక్షించేందుకు సినిమా థియేటర్ల నిర్వాహకులు అనుమతించరాదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నిబంధనను థియేటర్ల యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ మహిళలు, పిల్లలు, ఇతర ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఘటనలపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజా ప్రశాంతతకు భంగం కలగడమే కాకుండా రహదారులపై రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసులకు సహకరించాలి…..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరూ పోలీసుల ఆదేశాలను పాటించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కోరారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇట్లు: పోలీస్ పీఆర్వో, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








