-- --

# వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి….

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

## ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరతకు అవకాశం.. రైతులకు వ్యవసాయ అధికారి ముజామిల్ సూచన…

**బోధన్, అక్టోబర్ 31 ** రాబోయే యాసంగి సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని హున్సా వ్యవసాయ విస్తరణ అధికారి ముజామిల్ సూచించారు. నీటి వనరుల లభ్యతను ముందుగానే అంచనా వేసుకుని, వరికి బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు.

శనివారం సాలూర మండలంలోని హున్సా, మందర్న గ్రామాల్లో యాసంగి సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం, నీటి వనరుల లభ్యత, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముజామిల్ మాట్లాడుతూ.. వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల, వర్షపాతం తగ్గే అవకాశాలు వ్యవసాయంపై ప్రభావం చూపవచ్చని తెలిపారు. అందువల్ల రైతులు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

### నీటి భరోసా ఉంటేనే వరి సాగు

భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు తమ వద్ద ఉన్న నీటి వనరులను అంచనా వేసుకోవాలని ముజామిల్ సూచించారు. వరి పంటకు అధిక మొత్తంలో నీరు అవసరమవుతుందని, నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా సాగు చేస్తే పంట చివరి దశలో నీటి కొరత ఏర్పడి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని వివరించారు. దీంతో రైతులు పెట్టుబడి నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

### తక్కువ నీటితో అధిక ప్రయోజనం….

నీటి వసతి తక్కువగా ఉన్న భూముల్లో వరి సాగుకు బదులుగా శనగ, పెసర, మినుము, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ పంటల సాగుతో నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు పంట నష్టాల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.

రైతులు తమ భూమి స్వభావం, నేలలో తేమ, విత్తే సమయం, నీటి లభ్యతను బట్టి అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు. నీటి పొదుపు పద్ధతులను పాటిస్తూ, వ్యవసాయ శాఖ సూచనల మేరకు సాగు చేపడితే పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకుని మెరుగైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హున్సా సర్పంచ్ మార్కల్ శివకుమార్, మందర్న సర్పంచ్ రావుబా సావిత్ర గంగాధర్, రైతులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more