-- --

.చట్టాలపై ప్రతి విద్యార్థికి అవగాహన అవసరం!…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

చట్టాలపై ప్రతి విద్యార్థికి అవగాహన అవసరం!

పోక్సో చట్టం, సైబర్ నేరాలపై విద్యార్థులకు న్యాయ చైతన్య సదస్సు….

బోధన్ : అక్టోబర్ 30 : విద్యార్థి దశ నుంచే చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎం. పూజిత సూచించారు. బాలల హక్కులు, రక్షణ, మహిళల భద్రతతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

శనివారం సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా న్యాయ చైతన్య అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎం. పూజిత మాట్లాడుతూ.. పోక్సో చట్టం–2012 (లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం) గురించి విద్యార్థులకు వివరించారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికలను లైంగిక వేధింపులు, దోపిడీ నుంచి రక్షించేందుకు ఈ చట్టం అమలులో ఉందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.

పోక్సో బాధిత బాలల వ్యక్తిగత వివరాలను చట్టప్రకారం గోప్యంగా ఉంచుతారని, బాధితులకు ఉచిత న్యాయ సలహా, అవసరమైన న్యాయ సహాయం అందించే ఏర్పాట్లు ఉంటాయని భరోసా కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కలిగి ఉండటంతో పాటు, అసౌకర్యం కలిగించే స్పర్శ లేదా ప్రవర్తన ఎదురైతే వెంటనే విశ్వసనీయ పెద్దలకు చెప్పాలని సూచించారు.

అలాగే సైబర్ భద్రతపై మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్‌ను విద్య, విజ్ఞానం, అవసరమైన సమాచార సేకరణ వంటి మంచి పనుల కోసం మాత్రమే వినియోగించాలని తెలిపారు. ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు క్లిక్ చేయడం, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు కూడా తగిన పర్యవేక్షణ కలిగి ఉండాలని పేర్కొన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజీ మంజూష మాట్లాడుతూ.. న్యాయశాఖ అధికారులు, న్యాయమూర్తులు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడం సంతోషకరమని అన్నారు. గత మూడేళ్లుగా పాఠశాలలో పోక్సో చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలపై ముఖ్యంగా విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై ఎం. రాజశేఖర్, ఏజీపీ రవీందర్, రిటైనర్ లాయర్ అజయ్ కుమార్, లీగల్ ఎయిడ్ కౌన్సిలర్ పి. రామేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more