ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ క్షేమంగా తిరిగొచ్చే పరిస్థితులు ఉండాలి…
మహిళలపై దాడులు, వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి: బి. నాగమణి
బోధన్, అక్టోబర్ 30: నేటి సమాజంలో మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న దాడులు, వేధింపులను అరికట్టి వారికి పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని ప్రగతిశీల మహిళా సంఘం (POW) జిల్లా ఉపాధ్యక్షురాలు బి. నాగమణి ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
శుక్రవారం బోధన్ మండలంలోని అందాపూర్ గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం (POW) ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలతో నిర్వహించిన సమావేశంలో నాగమణి మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు భద్రతపై ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారుల నుంచి విద్యార్థినులు, ఉద్యోగినులు, వివిధ రంగాల్లో పనిచేసే మహిళల వరకు అనేక రూపాల్లో వేధింపులు, దాడులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు, పని ప్రదేశాల్లో మహిళలకు వేధింపులు ఎదురవుతుండటం ఆందోళనకరమన్నారు. మహిళలు వ్యక్తిగతంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరు ఆకతాయిలు, అసాంఘిక శక్తుల వల్ల ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు.
మహిళల భద్రత అనేది కేవలం వారి వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదని, అది ప్రభుత్వాలు, సమాజం ఉమ్మడిగా తీసుకోవాల్సిన బాధ్యత అని స్పష్టం చేశారు. మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణ న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.
అదేవిధంగా మహిళలకు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు పాఠశాలలు, కళాశాలలు, పని ప్రదేశాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలు నిర్భయంగా జీవించే వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వాలు సమర్థవంతమైన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సరూప, రేణుక, దేవకి, రుక్మాబాయి, సరోజతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







