‘ఇది రైతులు, కార్మికులు, బోధన్ ప్రజల విజయం’ : ఉద్యమ నాయకులు
బోధన్, మే 29 (ప్రతినిధి):
బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం పోరాటం చేసిన ఉద్యమ నాయకులపై 2018లో నమోదైన కేసును బోధన్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. కేసులో పోలీసులు సరైన సాక్ష్యాధారాలను సమర్పించలేకపోవడంతో, విచారణ అనంతరం న్యాయస్థానం ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులను నిర్దోషులుగా ప్రకటించింది.

నిజాం షుగర్ రక్షణ కమిటీ, తెలంగాణ సామాజిక పార్టీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ పునఃప్రారంభం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఉద్యమ నాయకులపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో బీర్కూర్ శంకర్, బి. మల్లేష్, పుట్ట వరదయ్య, వి. రాఘవులు (మరణించారు), గుమ్ముల గంగాధర్, జంబిశెట్టి శంకర్, ఏషాల గంగాధర్, సుల్తాన్ సాయిలు, సింగం రాములు యాదవ్, గోపి, షేక్ బాబు (మరణించారు), షేక్ ఫారుక్ (మరణించారు) తదితరులు నిందితులుగా ఉన్నారు.

ఉద్యమ నాయకుల కథనం ప్రకారం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధ్వర్యంలో పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ హామీ అమలు కాలేదని తెలిపారు. దీంతో 2018లో ఎన్నికల సమయంలో నిజాం షుగర్ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 200 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించగా, తెలంగాణ సామాజిక పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపట్టారు.
ఆందోళనలను పోలీసులు భగ్నం చేయడంతో నిరసనగా బోధన్ బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని నాయకులు పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్లుగా కోర్టు విచారణను ఎదుర్కొంటూ వచ్చిన తమకు న్యాయం జరిగిందని, కోర్టు తీర్పు రైతులు, కార్మికులు, బోధన్ ప్రజల విజయంగా భావిస్తున్నామని వారు తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్యమ నాయకులు న్యాయస్థాన తీర్పును స్వాగతిస్తూ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








