Post Views: 95
తెలంగాణ భూభాగంలో బహిరంగ దందా – టిప్పర్లలో మట్టి, ట్రాక్టర్లలో ఇసుక తరలింపు.. కొందరు అధికారులు తొత్తులా మారారా..?
సాలూర మండల పరిధిలోని హుంసా, మందర్ణ గ్రామాల సమీప మంజీరా నది పరివాహక ప్రాంతాలు అక్రమ తవ్వకాల మాఫియాకు అడ్డాగా మారాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు మహారాష్ట్రకు చెందిన ఇసుక మాఫియా తెలంగాణ భూభాగంలోకి చొరబడి ఇసుక దోపిడీకి పాల్పడుతుండగా, మరోవైపు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం పేరిట మట్టి తవ్వకాలు బహిరంగంగానే సాగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.
పగలు, రాత్రి తేడా లేకుండా జేసీబీ యంత్రాలతో మట్టిని తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండగా, మరికొందరు ఇసుకను కూడా అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ నది పరిసర ప్రాంతాల్లో ఈ దందా కొనసాగుతున్నా సంబంధిత శాఖలు చూసీ చూడనట్లు వ్యవహరించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
ఇటీవలే తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు చెందిన కొందరు వాహన యజమానులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని గుర్తించిన అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి వాహనాలపై చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు మహారాష్ట్రకు చెందిన కొందరు ఇసుక క్వారీ యజమానులు రాత్రివేళల్లో తెలంగాణ భూభాగంలోకి చొరబడి తవ్వకాలు జరుపుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. అప్పట్లో కఠినంగా వ్యవహరించిన అధికారులు, ఇప్పుడు ఎందుకు కళ్లుమూసుకున్నారనే చర్చ సాగుతోంది.
గ్రామస్తుల ఆరోపణల ప్రకారం, కొందరు అధికారులు మాఫియాకు తొత్తులుగా మారి మామూలులకు అమ్ముడు పోయారనే మాటలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అందుకే ఫిర్యాదులు వెళ్లినా చర్యలు లేకుండా ఫైళ్లు మూలన పడేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సినవారే మౌనం పాటిస్తుండటం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది.
ఇప్పటికే కొందరు అధికారులు నామమాత్రపు సర్వేలు నిర్వహించి, “సమగ్ర సర్వేలు చేపడతాం”, “నోటీసులు జారీ చేస్తాం” అంటూ కాకమ్మ కథలు చెప్పి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూభాగం దోచేస్తుంటే కేవలం మాటలకే పరిమితమవడం వెనుక అసలు కారణమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న తెలంగాణ సరిహద్దు ప్రాంతాల గ్రామాలు హుంసా, మందర్ణ, ఖాజాపూర్, తెగ్గెల్లి గ్రామాల పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమగ్ర సర్వేలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ గ్రామాల సరిహద్దుల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై భూసర్వే, డ్రోన్ సర్వే, రికార్డుల పరిశీలన చేపట్టి అసలు వాస్తవాలు బయటపెట్టాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా బోధన్ ఎమ్మెల్యే గారు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మంజీరా సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారితో పాటు వారికి సహకరిస్తున్న అధికారులపై శాఖాపరమైన, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
“వీరి ఆగడాలపై నిజంగా నోటీసులు జారీ చేస్తారా..? సమగ్ర సర్వేలు నిర్వహిస్తారా..? లేక మళ్లీ మాటలకే పరిమితమవుతారా..? వేచి చూడాలి మరి..” అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







