May 3, 2026 3:50 pm

V1News Telangana

ఒకపక్క మహారాష్ట్ర ఇసుక మాఫియా చొరబాటు… మరోపక్క ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మట్టి దోపిడీ..! మంజీరా తీరాన్ని మాఫియాకు అప్పగించారా..?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

తెలంగాణ భూభాగంలో బహిరంగ దందా – టిప్పర్లలో మట్టి, ట్రాక్టర్లలో ఇసుక తరలింపు.. అధికారులు ఎందుకు మౌనం..?

సాలూర మండల పరిధిలోని హుంసా, మందర్ణ గ్రామాల సమీప మంజీరా నది పరివాహక ప్రాంతాలు అక్రమ తవ్వకాల మాఫియాకు అడ్డాగా మారాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు మహారాష్ట్రకు చెందిన ఇసుక క్వారీల మాఫియా తెలంగాణ భూభాగంలోకి చొరబడి ఇసుక దోపిడీకి పాల్పడుతుండగా, మరోవైపు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం పేరిట మట్టి తవ్వకాలు బహిరంగంగానే సాగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.
పగలు, రాత్రి తేడా లేకుండా జేసీబీ యంత్రాలతో మట్టిని తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండగా, మరికొందరు ఇసుకను కూడా అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ నది పరిసర ప్రాంతాల్లో ఈ దందా కొనసాగుతున్నా సంబంధిత శాఖలు చూసీ చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
భారీ వాహనాల రాకపోకలతో గ్రామీణ రహదారులు ధ్వంసమవుతుండగా, దుమ్ము, శబ్ద కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ తవ్వకాలతో భూగర్భ జలాలు తగ్గిపోవడం, భూసార నష్టం కలగడం, భవిష్యత్తులో మంజీరా తీర ప్రాంతం ఎడారిలా మారే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖ అధికారులు మౌనం పాటించడం వెనుక కారణమేంటన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. కొందరు అధికారుల అండదండలతోనే ఈ అక్రమ దందా నడుస్తోందా..? లేక ప్రజల ఫిర్యాదులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారా..? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
తక్షణమే ప్రత్యేక దళాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారితో పాటు వారికి సహకరిస్తున్న అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
“మంజీరా తీరాన్ని మాఫియా దోచేస్తుంటే చూస్తూ ఊరుకునే రోజులు పోయాయి… ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలి.. లేకపోతే ప్రజలే పోరాటానికి దిగుతారు” అంటూ స్థానికులు హెచ్చరిస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more