గ్రామం మధ్య నుంచి భారీ వాహనాల రాకపోకలపై ఆందోళన.. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? భూగర్భ జలాలపై ప్రభావం పడదా? అధికారుల విచారణకు గ్రామస్తుల డిమాండ్….

సాలూరా: నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం తగెల్లి గ్రామంలో అనుమతుల పేరుతో పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తుండటంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామస్తులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని తమ నిరసన వ్యక్తం చేశారు.
గ్రామం మధ్య నుంచి భారీ వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు, నీటి కొరత కారణంగా బోర్వెల్ వేయాలన్నా ప్రభుత్వం అనుమతులు తీసుకోవాల్సిన నిబంధనలు విధిస్తుండగా, మంజీరా నది నుంచి పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరపడం వల్ల భూగర్భ జలాలపై ప్రభావం పడదా? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో గ్రామాల్లో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక రవాణాకు సంబంధించి ఇచ్చిన అనుమతులు ఎప్పటి వరకు చెల్లుబాటులో ఉంటాయి? ఎన్ని రోజులపాటు అనుమతులు ఇచ్చారు? అనుమతుల్లో పేర్కొన్న నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అనే అంశాలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించాలని, భారీ వాహనాలు గ్రామం మధ్య నుంచి వెళ్లకుండా గ్రామం వెలుపలి నుంచి రాకపోకలు సాగించేలా ప్రత్యేక రవాణా మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ప్రజల భద్రత, గ్రామీణ రహదారుల పరిస్థితి, భూగర్భ జలాల పరిరక్షణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందిస్తారా? ఇసుక రవాణాపై స్పష్టత ఇస్తారా? అన్నది వేచి చూడాలి.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








