#జానకంపేట పోలీస్ ## ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్, నవంబర్ 14:
5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ముగింపు కార్యక్రమానికి సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ శనివారం క్షుణ్ణంగా పరిశీలించారు….

జానకంపేటలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మైదానాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్.. పరేడ్ గ్రౌండ్, వేదిక ఏర్పాటు, క్రీడాకారులు, పోలీస్ అధికారులు, ప్రముఖ అతిథులు, ప్రేక్షకుల కోసం కల్పించాల్సిన సౌకర్యాలను సమీక్షించారు. అదేవిధంగా భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ముగింపు వేడుకలకు హాజరయ్యే ఉన్నతాధికారులు, ప్రముఖ అతిథులు, క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి విభాగానికి కేటాయించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వహిస్తూ, కార్యక్రమం ఎలాంటి లోటుపాట్లు లేకుండా క్రమశిక్షణతో విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలకు నిజామాబాద్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ముగింపు వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ఇందుకోసం అన్ని విభాగాల అధికారులు సమష్టిగా కృషి చేయాలని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎడపల్లి ఎస్ఐ రమతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







