.ప్రచార పత్రాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్….
నిజామాబాద్, నవంబర్ 12: సమాజ సేవే లక్ష్యంగా, ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు చేపడుతున్న అన్నపూర్ణ సేవా రథం కార్యక్రమం అభినందనీయమని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం అన్నపూర్ణ సేవా రథం ప్రచార పత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చేపడుతున్న సేవా కార్యక్రమాల ఉద్దేశాన్ని తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు.
కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఈ సేవా రథం ద్వారా సేవలు అందించాలనే సంకల్పం గొప్పదని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు, అంత్యక్రియలకు హాజరయ్యే బంధుమిత్రులకు భోజన సదుపాయం కల్పించడం మానవతా దృక్పథానికి నిదర్శనమని కొనియాడారు.
ఆప్తులను కోల్పోయిన సమయంలో కుటుంబ సభ్యులు మానసిక వేదనతో పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, అలాంటి క్లిష్ట సమయంలో భోజన ఏర్పాట్ల బాధ్యతను స్వచ్ఛందంగా తీసుకోవడం ఎంతో గొప్ప సేవ అని అభిప్రాయపడ్డారు. కులమతాలు, చిన్నాపెద్దా అనే భేదాలు లేకుండా అవసరమైన ప్రతి కుటుంబానికి సేవలు అందించాలనే ఆలోచన సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని, అన్నపూర్ణ సేవా రథం ద్వారా మరెందరికో సహాయం అందించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, డీసీసీ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, డీసీసీ జనరల్ సెక్రటరీ జూలూరి సుధాకర్, తాటి ప్రసాద్, కామారెడ్డి మాజీ కౌన్సిలర్లు జమీల్, సలీం, చింతల రవీందర్ గౌడ్, చాట్ల వంశీ, పిడుగు సాయిబాబా, రంగా రమేష్ గౌడ్, సునీల్ గౌడ్, బండారి శ్రీకాంత్, అరవింద్, బల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







