రూ.లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, కారు స్వాధీనం…
నిజామాబాద్, నవంబర్ 4: పగటిపూట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు దొంగతనాలకు ఉపయోగించిన కారు, నకిలీ నంబర్ ప్లేట్లు, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., బుధవారం వెల్లడించారు.
నవీపేటలో నమోదైన కేసుతో ముఠా గుట్టురట్టు…
నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో అక్టోబర్ 4న చోరీ జరిగింది. ఫిర్యాదుదారుడు మహమ్మద్ నవీదుద్దీన్ మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంటికి తాళం వేసి హోటల్‌కు వెళ్లాడు. సాయంత్రం 6.30 గంటలకు తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాకు చెందిన సయ్యద్ షకీల్‌తో పాటు మరో ఇద్దరు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో నవంబర్ 4న నిందితులు నిజామాబాద్ వైపు వస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు నవీపేట ప్రాంతంలో ఉదయం 11 గంటలకు వారిని అదుపులోకి తీసుకున్నారు.
పలు జిల్లాలు, రాష్ట్రాల్లో చోరీలు…
పోలీసుల విచారణలో నిందితులు నవీపేట చోరీతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించినట్లు కమిషనర్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ ప్రాంతంలోనూ పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని పేర్కొన్నారు.
ముఠాలో ప్రధాన నిందితుడిగా ఉన్న సయ్యద్ షకీల్ గతంలోనూ పలు రాష్ట్రాల్లో దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లినట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు.

నకిలీ నంబర్ ప్లేట్లతో చోరీలు…
నిందితులు మారుతి హోండా సిటీ కారును ఉపయోగిస్తూ, దానికి నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చి చోరీలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. సయ్యద్ షకీల్ ఒక్కడే ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసేవాడని, మిగిలిన ఇద్దరు నిందితులు బయట ఉండి పరిసరాలను గమనిస్తూ అతనికి సమాచారం అందించేవారని వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు….
నిందితుల నుంచి మొత్తం 78 గ్రాముల బంగారు ఆభరణాలు, 29 తులాల వెండి ఆభరణాలు, రూ.5,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటితో పాటు దొంగతనాలకు ఉపయోగించిన సుమారు రూ.5 లక్షల విలువైన హోండా సిటీ కారు, మూడు నకిలీ నంబర్ ప్లేట్లు, మూడు ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు.
11 కేసుల్లో నిందితుల ప్రమేయం….
నిందితులు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్ జిల్లాల్లో నమోదైన మొత్తం 11 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. వీటిలో నవీపేట, నిజామాబాద్ టౌన్ IV, డిచ్పల్లి, బిక్కనూర్, ముధోల్, బాసర, ఆలేరు, చొప్పదండి పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులు ఉన్నాయి.
పోలీసు బృందానికి కమిషనర్ అభినందనలు..
ఈ కేసును నిజామాబాద్ డివిజన్ ఏసీపీ బి. ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఛేదించాయి. నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీహెచ్. శ్రీనివాస్, నవీపేట ఎస్ఐ కే. శ్రీకాంత్, సీసీఎస్ ఏసీపీ పి. శ్రీశైలం, సీఐ అజయ్ కుమార్‌తో పాటు సీసీఎస్, సీడీఆర్ సెల్ సిబ్బంది దర్యాప్తులో పాల్గొన్నారు.
కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.
పోలీసుల సూచన: ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”









