నిజామాబాద్, నవంబర్ 4: దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాటను పూర్తిగా నిషేధించినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు. పేకాట ఆడినా, స్థావరాలు నిర్వహించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పోలీస్ డివిజన్ల పరిధిలో పేకాట నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. పండుగ సమయంలో ఎవరైనా పేకాట ఆడినా, ఇతరులను ప్రోత్సహించినా, పేకాట స్థావరాలను నిర్వహించినా లేదా వాటికి సహకరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు పేకాటపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎక్కడైనా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నా, ఆడిస్తున్నా వెంటనే నిజామాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659700 కు సమాచారం అందించాలని కమిషనర్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ప్రజలు పోలీసులకు సహకరించి దీపావళి పండుగను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







