విదేశీ గడ్డపై తెలుగు వెలుగు.. రియాద్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం…
భాషతో పాటు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపు..,
రియాద్, సెప్టెంబర్ 18 (V1 న్యూస్):
సౌదీ అరేబియాలోని రియాద్‌లో సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, భాషాభిమానులు హాజరయ్యారు.
తెలుగు కేవలం మాతృభాష మాత్రమే కాదని, తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, భావోద్వేగాలు, చరిత్రతో విడదీయరాని అనుబంధం కలిగిన భాష అని వక్తలు పేర్కొన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు భావితరాలకు పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
ప్రతి సంవత్సరం SATA రియాద్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. భాషా, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ SATA చురుకుగా పనిచేస్తోందన్నారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు, ముఖ్యంగా ఆపదలో ఉన్న కార్మికులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని వివరించారు.

అవసరమైన సందర్భాల్లో భారత రాయబార కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ SATA కోర్ టీమ్ బాధ్యతాయుతంగా పనిచేస్తోందని తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి సరైన మార్గదర్శకత్వం, అవసరమైన సహాయం అందించేందుకు సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
కార్యక్రమానికి SATA ఫౌండర్ మల్లేష్, రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ.. సౌదీ అరేబియాలో నివసిస్తున్న తెలుగు వారంతా ఒకే వేదికపైకి వచ్చి తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అవసరంలో ఉన్న తెలుగు వారిని ఆదుకోవడం కూడా తెలుగు భాష, సమాజం పట్ల మనకున్న గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జెడ్డా అధ్యక్షులు అంజాద్, ఈస్ట్రన్ రీజియన్ అధ్యక్షులు తేజ, TASA ఫౌండర్ స్వామి పాల్గొన్నారు. జెడ్డా అధ్యక్షులు అంజాద్ తన పాటలతో కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చి ప్రేక్షకులను అలరించారు.
వేడుకల విజయవంతానికి రియాద్ కోర్ టీమ్ సభ్యులు శర్వాణి విద్యాధరణి, కోకిల ఒథెలూరి, ప్రీతి, మహమ్మద్ నూరుద్దీన్, లోకేష్ తాళ్ల, సింగ్ నరేష్, శహబాజ్ అహ్మద్, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిథున సురేష్, ముదిగొండ శంకర్, వీరవల్లి యోగేశ్వర రావు, మురళి క్రిష్ణ బూసి, నయీమ్, అయాజ్, ముజామిలుద్దీన్, శ్రీచరణ్, అస్లాం రోజదార్, ఫణి కె. అయ్యగారి, ఇలియాస్ తదితరులు కీలకంగా వ్యవహరించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








