డీపీ లో మొదలైన ప్రస్థానం
– ఇరువురి ఆలింగనంతో దేశ రాజకీయాల్లో చర్చ
హైద్రాబాద్ న్యూస్ ఈస్ట్ జోన్ ప్రతినిధి :- తెలంగాణ రాజకీయ యవనికపై వీరిద్దరూ రెండు భిన్న ధృవాలు. కానీ.. ఆ ధృవాల మధ్య ఉన్న అనుబంధం చాలా మందికి తెలియదు. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఉప్పు-నిప్పులా ఉండే ఇద్దరు ఉద్ధండులు ఒక్కటవ్వబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి.. దశాబ్దాల కాలంగా వీరిద్దరి మధ్య సాగిన పోరాటం ఇప్పుడు ఒక మలుపు తిరిగింది. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ జెండాను మోసిన జగిత్యాల పులి జీవన్ రెడ్డి.. ఇప్పుడు గులాబీ గూటికి చేరుతుండటం వెనుక కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదు, ఒక బలమైన పాత సాన్నిహిత్యం కూడా ఉంది.
వీరిద్దరి ప్రస్థానం 1980వ దశకంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే మొదలైంది. అప్పట్లో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్ చాణక్యం, జీవన్ రెడ్డి నిబద్ధత పార్టీలో ప్రత్యేక చర్చకు దారితీసేవి. నిజానికి.. కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యే కాకముందే, 1983లో జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ రోజుల్లో వీరిద్దరూ పార్టీ పనుల నిమిత్తం తరచూ కలుస్తూ.. రాజకీయ వ్యూహాలను పంచుకునేవారు. ఆనాటి స్నేహమే నేటి రాజకీయ మార్పులకు పునాదిగా కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2014 ఎన్నికల సమయంలోనే కేసీఆర్ తన పాత మిత్రుడికి ఆహ్వానం పంపారు. మీరు టీఆర్ఎస్‌లోకి రండి.. జగిత్యాల చక్కెర కర్మాగారం పునరుద్ధరణ బాధ్యతలు మీకే అప్పగిస్తా అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కానీ, అప్పుడు జీవన్ రెడ్డి తన విలువలకు కట్టుబడి కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. ప్రత్యర్థి పార్టీలో ఉన్నా, తన పాత మిత్రుడికి కేసీఆర్ ఇచ్చే గౌరవం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఆ గౌరవమే ఇప్పుడు మళ్ళీ ఇద్దరినీ దగ్గర చేస్తోంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు జీవన్ రెడ్డిని తీవ్రంగా కుంగదీశాయి. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికను ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఇదే సమయంలో కేసీఆర్ పంపిన దూతగా కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లడం అసలు మలుపు. “కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది” అని జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని, కేవలం పాత జ్ఞాపకాలు, కొత్త అవసరాలే శాసిస్తాయని ఈ ఇద్దరి బంధం నిరూపిస్తోంది.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. 1985 తర్వాత ఎన్టీఆర్ కేబినెట్ లో మార్పులు జరిగినప్పుడు జీవన్ రెడ్డి పేరు బలంగా వినిపించింది. అప్పట్లో కేసీఆర్ కూడా పార్టీలో కీలక బాధ్యతల్లో ఉండేవారు. ఒకానొక సందర్భంలో కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డికి పార్టీ పరంగా మద్దతు ఇచ్చారు. కానీ, అనూహ్యంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో ఆ బంధం ఉప్పు-నిప్పు లా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేసీఆర్ ఒకప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గట్టిగా మాట్లాడేవారు. కేసీఆర్ ఒక సందర్భంలో తెలంగాణ గొంతుకను జీవన్ రెడ్డి తనదైన శైలిలో వినిపిస్తారు, ఆ నిబద్ధత అందరికీ ఉండదు అని ప్రశంసించారు. అంటే.. ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ జీవన్ రెడ్డి సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే కేసీఆర్‌కు అమితమైన గౌరవం. అందుకే, ఎవరినైనా పార్టీలోకి తీసుకునేటప్పుడు కేసీఆర్ కేవలం రాజకీయాలు చూస్తారు. కానీ జీవన్ రెడ్డి విషయంలో మాత్రం ఆయన మేధావి తనాన్ని కోరుకుంటున్నారు.
జీవన్ రెడ్డికి జగిత్యాల అంటే ప్రాణం. ఆ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఆయన ఏమైనా చేస్తారు. కేసీఆర్ కు ఈ వీక్ పాయింట్ బాగా తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ తనను కాదని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు ప్రాధాన్యత ఇవ్వడం జీవన్ రెడ్డి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. కేసీఆర్ సరిగ్గా ఇక్కడే తన దోస్తీ కార్డును ఉపయోగించారు. నీ ఆత్మాభిమానం దెబ్బతినని చోట ఉండు అనే సందేశాన్ని కేటీఆర్ ద్వారా పంపారు.
ఇక రాజకీయాల్లో కుల సమీకరణలు సహజం. కానీ, కేసీఆర్, జీవన్ రెడ్డి మధ్య ఉన్నది తెలంగాణ ఓల్డ్ గార్డ్ సెంటిమెంట్. 1969 ఉద్యమం నుంచి మొన్నటి 2014 వరకు ఉన్న సీనియర్ నేతల్లో వీరిద్దరూ సమకాలీనులు. కేసీఆర్ ఆలోచన ఏంటంటే.. ఇప్పుడున్న కొత్తతరం రాజకీయాల మధ్య, తన పాత మిత్రుడు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ తన పక్కన ఉంటే బిఆర్ఎస్ కు ఒక మొరల్ అథారిటీ వస్తుందని ఆయన నమ్ముతున్నారు.
కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఏదో ఒకరోజులో జరిగిన పరిణామం కాదు. గత మూడు నెలలుగా కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డితో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా జీవన్ రెడ్డి రాసిన కొన్ని పుస్తకాలు, ఆయన సభల్లో మాట్లాడిన పాత ప్రసంగాలను కేసీఆర్ గుర్తు చేస్తూ ఆయన్ని ప్రసన్నం చేసుకున్నారని రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది. మొత్తానికి కేసీఆర్, జీవన్ రెడ్డి ఒక్కటవ్వడం.. తెలంగాణ రాజకీయాల్లో నూతన అధ్యయనానికి తెరలేపబోతోందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








