మల్కాజ్‌గిరిలో ఫుట్‌పాత్ షాపుల తొలగింపు – వ్యాపారుల ఆవేదన
నోటీసులు లేకుండా షాపుల కూల్చివేతపై వ్యాపారుల ఆగ్రహం
ఫైన్ తీసుకుని షాపులు కూల్చివేత – అధికారులపై ఆరోపణలు
“మా జీవనాధారం ఎక్కడ?” – బాధితుల కన్నీటి వేదన..
మల్కాజ్‌గిరి, ఏప్రిల్ 8:
మల్కాజ్‌గిరి ప్రాంతంలో ఫుట్‌పాత్‌లపై వ్యాపారం నిర్వహిస్తున్న చిన్న వ్యాపారుల షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసుల సహకారంతో తొలగించడం వివాదాస్పదంగా మారింది. ఈ చర్యపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితుల వివరాల ప్రకారం, సుమారు 20 రోజుల క్రితం అధికారులే తమ వద్ద నుంచి రూ.5 వేల వరకు ఫైన్ వసూలు చేసినప్పటికీ, ఆ సమయంలో షాపులు తొలగించాల్సిందిగా ఎలాంటి హెచ్చరికలు లేదా నోటీసులు ఇవ్వలేదని ఆరోపించారు. అకస్మాత్తుగా షాపులను కూల్చివేయడం తమపై అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
ఈ చర్యల వల్ల పలువురు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, రోజువారీ జీవనాధారం కోల్పోయి తీవ్ర ఆర్థిక కష్టాల్లో పడిపోయామని తెలిపారు. “పొద్దున నుండి తినడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు ఎలా బ్రతకాలనే ఆలోచనలో ఉన్నాం” అని వారు వాపోయారు.
ఇంకా, పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి తమను బలవంతంగా అక్కడి నుంచి తొలగించారని, కనీసం కొంత సమయం ఇవ్వాలని వేడుకున్నప్పటికీ వినిపించలేదని బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటనలో కొందరిని ఈడ్చి పడేసినట్లు ఆరోపించారు.
ప్రస్తుతం వేరే చోట ఆశ్రయం లేక, కూల్చివేసిన ప్రదేశంలోనే రాత్రివేళలు గడుపుతూ బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ఘటనపై స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బాధితులకు న్యాయం చేయాలని, ఇటువంటి చర్యల్లో మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని వారు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832









