ధాబాలే బార్‌లుగా మారాయి… గ్రామాల భద్రత గాల్లోకి – మద్యం అక్రమ కేంద్రాలపై చర్యలు ఎప్పుడు?
అధికారుల అండతోనేనా అక్రమ మద్యం సిట్టింగ్ కేంద్రాలు? బోధన్–సాలూరలో ప్రజల ఆగ్రహం….
నిజామాబాద్ జిల్లా బోధన్, సాలూర మండలాల్లో హైవేల పక్కన ఉన్న ధాబాలు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కిరాణా షాపులు మద్యం అక్రమ సిట్టింగ్ కేంద్రాలుగా మారిపోయాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే బార్‌లను తలపించే విధంగా మద్యం విక్రయాలు, సిట్టింగ్ ఏర్పాట్లు చేసి అర్థరాత్రి వరకూ మద్యం సేవనానికి అవకాశం కల్పించడం బహిరంగ రహస్యంగా మారింది.
గ్రామాల సమీపంలోనే ఈ అక్రమ కేంద్రాలు జోరుగా నడుస్తుండటంతో శాంతిభద్రతలకు తీవ్ర ముప్పు ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న వారి అల్లర్లు, గొడవలు, అసభ్య ప్రవర్తనలు, రహదారి ప్రమాదాల భయం రోజురోజుకూ పెరుగుతోందని వాపోతున్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన గ్రామ వాతావరణం పూర్తిగా కలుషితమైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు మౌనం వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆబ్కారీ శాఖ, పోలీస్ శాఖ, కార్మిక శాఖ, ఆహార భద్రతా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన సమయంలో పూర్తిస్థాయిలో నిశ్శబ్దం పాటించడం వెనుక అవినీతి, లంచాల ప్రమేయం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ అక్రమ కేంద్రాల్లో బాల కార్మికులను ఉపయోగిస్తున్నా కార్మిక శాఖ స్పందించకపోవడం. ఆహార భద్రతా నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతూ నిర్వాహకులు “నాకు అడ్డెవరు?” అన్న ధోరణితో వ్యవహరించడం అధికారుల అండదండల ఫలితమేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు ఈ అక్రమ కేంద్రాల వైపు కనీసం వెళ్లకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జిల్లా స్థాయి అధికారులు సైతం పరిస్థితిని చూసీ చూడనట్టు వ్యవహరించడం, కొందరు అధికారులు నిర్వాహకుల అతిథ్యాలు స్వీకరిస్తున్నారన్న ప్రచారం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది.
మద్యం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కారణంగా చూపుతూ ప్రజల భద్రతను పక్కన పెట్టి అక్రమాలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఒకవైపు అయితే, అధికారులకు అక్రమ ఆదాయం మరోవైపు అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో బోధన్, సాలూర మండలాల్లో హైవేల పక్కన ఉన్న అన్ని ధాబాలు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కిరాణా షాపులపై తక్షణమే ప్రత్యేక దాడులు, విస్తృత తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ మద్యం సిట్టింగ్ కేంద్రాలను పూర్తిగా మూసివేసి, నిర్వాహకులపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేసి,సంబంధిత అధికారుల బాధ్యతారాహిత్యంపై కూడా విచారణ జరపాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు మేల్కొని మద్యం మాఫియాపై కొరడా ఝుళిపిస్తారా?
లేక మౌనమే వారి శాశ్వత విధానమా?
అన్నది ప్రజలు గమనిస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









