నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమన్నదే మాకు చేసిన నేరమా? ప్రజల సమస్యలపై మాట్లాడితే ముందస్తు అరెస్టులా? అంటూ వామపక్ష నేతలు ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ(ఎం-ఎల్) మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్, సిపిఎం బోధన్ కార్యదర్శి శంకర్ గౌడ్, న్యూ డెమోక్రసీ పార్టీ కార్యదర్శి పి. వరదయ్యలు మాట్లాడుతూ— కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటనల ముందు తమ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీలు ఎలాంటి ప్రతిఘటనకు పిలుపునివ్వకపోయినా, పోలీసులు అనవసరంగా నిర్బంధిస్తున్నారని విమర్శించారు.
అలానే, పాలకులు ఎన్నికల హామీలు విస్మరించి కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు తీసుకొస్తూ, సామాన్యులపై భారం మోపుతున్నారని వాపోయారు. ఇటువంటి ప్రజావ్యతిరేక విధానాలపై ఎదురు మాట్లాడిన వారిపై నిర్బంధాలు పెడతారా? అని ప్రశ్నించారు.
ఇటీవల ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసభోలే రాజ్యాంగం పీఠికలోని “సెక్యులర్” మరియు “సోషల్ జస్టిస్” పదాలను తొలగించాలని చెప్పిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. ఇది రాజ్యాంగ పట్ల వారికి గౌరవం ఏ స్థాయిలో ఉందో చెప్పే సూచిక అని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల రైతు సంఘం బోధన్ మండల అధ్యక్షుడు పడాల శంకర్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జి. సీతారాం, మహిళా సంఘం అధ్యక్షురాలు బి. నాగమణి, బి. శంకర్, టీయూసీయై నాయకులు ఈర్షద్ పాషా, డి. పోశెట్టి, అంజాద్, భాయ్, సమీర్, నజీర్, సలీం, గంగారాం, సాయిలు, లక్ష్మి, గంగామణి, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533