– పార్టీ జెండా ఆవిష్కరణ
– బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పార్టీ పనిచేస్తుందని వివరణ
– సమ సమాజ నిర్మాణం కొరకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరిక
– జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు గౌడ్
నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా : ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 86వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం రోజు నిజామాబాద్ నగరంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం లక్ష్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1939 జూన్ 22న పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. స్వాతంత్రనంతరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బడుగు, బలహీన, వర్గాలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని, సమ సమాజ స్థాపన కొరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గత 85 సంవత్సరాలుగా పేద ప్రజల తరపున పోరాడుతూ, ఉద్యమాలు చేస్తున్నదని పేర్కొన్నారు . సామాన్య పేద వర్గాలకు విద్యా, ఉపాధి హక్కులకై ఉద్యమిస్తూ వామపక్ష పార్టీలతో కలిసి ఈ దేశంలో అనేక ఉద్యమాలను జరిపిందని ఆయన అన్నారు. కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగ ప్రజాక్షేత్రంలో పేద ప్రజల పక్షాన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పోరాడుతుందని ఆయన తెలియజేశారు . నల్లధనాన్ని వెలికి తీస్తాం, దేశ భవిష్యత్తును మారుస్తామని అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నల్లధనాన్ని వెలికి తీయకపోగా, ఈ దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే కుట్రలో భాగంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రైవేటుపరం చేసి అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ వ్యక్తులకు దేశ సంపదను మోడీ ప్రభుత్వం దోచిపెడుతుందని ఆయన మండిపడ్డారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజల మధ్య మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిత్యవసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు విద్యా, ఉపాధి అవకాశాలు లేక సామాన్య పేద,బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నా నరేంద్ర మోడీ మాత్రం దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
మరోవైపు గత పది ఏళ్ల బిఆర్ఎస్ పాలన పట్ల విసిగి వేసారి పోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే,అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత పాలకుల పై దుమ్మెత్తి పోయడం తప్ప అభివృద్ధి వైపు ఆలోచన చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఆకాంక్షలతో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అధికారం కట్టబెడితేఉద్యమకారులకు బడుగు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందనే ఆశ అడియాశగానే మిగిలిందని ఎద్దేవా చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వారికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసి సమస్యల పరిష్కారానికి ఉవ్వెత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..