– మరమ్మతులకు నోచుకోని బోర్లు
– వ్యవసాయ బోర్ల వద్ద బిందెలతో బారులు తీరిన జనం
– తీవ్రమైన చలిలో కూడా నీళ్లు తెచ్చుకుంటేనే దాహం తీరేది
– అధికారులు… పాలకుల నిర్లక్ష్యం
– జుక్కల్ నియోజకవర్గం గుల్ల తండావాసుల ఆవేదన
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గంలోని.. జుక్కల్ మండలం గుల్ల తండాలో గిరి పుత్రులు మంచినీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో గల బోర్లు పాడైపోవడంతో అధికారులకు, పాలకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడంతో తాండ వాసుల పరిస్థితి దారుణంగా తయారైంది. గుక్కెడు మంచినీళ్ల కొరకు తీవ్రమైన చలిలో కూడా పంట పొలాల్లో గట్లు వెంబడి నడుచుకుంటూ వెళ్లి ఉదయం సాయంత్రం వేళల్లో వ్యవసాయ బోరు బావుల వద్ద బారులు తీరుతూ దాహాన్ని తీర్చుకోవలసిన దుర్భర పరిస్థితి నెలకొంది. ప్రజలు గ్రామంలో పాడైపోయిన బోర్లను బాగు చేయించమని అధికారులను అడిగితే వారు నిధులు లేవని సాకులు చెబుతూ బాగు చేయించకపోవడంతో తాండ ప్రజలు మంచినీటి కొరకు అగచాట్లు పడుతున్నారు. దశాబ్దాల కాలంగా జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడిపోయి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.. గతంలో పరిపాలించిన నాయకులు అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం ఆస్తులు కూడకట్టుకునే పనిలోనే తమ పరిపాలన కాలాన్ని ముగించుకున్నారని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారిని కాదని కొత్తవారిని ఎన్నుకుంటే వారు కూడా రాజకీయ విమర్శలతో, వర్గ పోరుతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. దాదాపు 1100 జనాభా కలిగిన తండాలో ఇప్పటివరకు ఈ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు అందించకపోవడం గమనార్హం. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న వేసవికాలంలో మంచి నీటి ఎద్దడితో ఇంకా మేము ఎన్ని కష్టాలు పడాలో అని తండావాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు లక్ష్మీకాంతరావ్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి తండాలో పాడైపోయిన బోర్లను బాగు చేయించి.. ప్రజల దాహార్తిని తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని తాండావాసులు కోరుతున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








