– మమల్ని ఆదుకోండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఉద్యోగులు
– 5 నెలలుగా జీతభత్యాలు లేవు
– అడిగితే కోపంతో కసురుకుంటున్న వైనం
–
ఉద్యోగుల శ్రమదోపిడి చేస్తున్న ఏజెన్సీలు
కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూల్ లు మరియు జూనియర్ కళాశాలలు ఉండగా.ఆయా స్కూల్ లలో టీజీటీ లు, పీజీటీలు మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పనిచేస్తున్నారు.
ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఫిజికల్ డైరెక్టర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, నైట్ వాచ్ మెన్ లుగా పనిచేస్తున్నారు. అయితే కొంతకాలంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు నెలవారీగా (రెమ్యూనరేషన్) జీత భత్యాలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ బ్రతుకు బండిని లాగుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటివరకు మూడు నెలల నుండి ఐదు నెలల జీతాలు రాకపోవడంతో వారి జీవితాలలో ఆందోళన అలుముకుంటున్నాయి.అధికారుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలు విన్నవించినప్పటికీ కోపంతో కసురుకుంటున్నారని వాపోతున్నారు. ప్రతినెల జిల్లా అధికారులతో మరియు రాష్ట్ర అధికారులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వారితో మాట్లాడితే రెండు మూడు రోజుల్లో మీ జీత భత్యాలు వస్తాయంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఐదు నెలలుగా జీతాలు రావటం లేదు దీంతో విసుగు చెందిన మోడల్ స్కూల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మూడు రోజుల క్రితం హెడ్ ఆఫీస్ కి ఫోన్ చేసి సంప్రదించగా వారు కూడా స్పందించక పోగా ఉద్యోగులపై కసురుకోవటం జరిగిందని తెలిపారు.194 మోడల్ స్కూల్ లలో పనిచేస్తున్నటువంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు ఈ నెల వచ్చే రెమ్యూనరేషన్ పైనే ఆధారపడి ఉన్నాయి. దసరా పండుగకు కొత్త బట్టలు కొనలేక ఎవరికి చెప్పుకోలేక పండుగ రోజు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీపావళి పండుగ కూడా వస్తుంది ఇప్పటివరకు కూడా జీతాలు రాక వారి కుటుంబాలు ఆందోళనకరంగా ఉన్నాయి.ఇప్పటివరకు జీతాలు రాకపోవడంతో తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆర్థిక స్థోమత సరిపడక వారు అసహనంతో మూకుమ్మడిగా సోమవారం నుండి వారం రోజులు సెలవు పెట్టడం జరుగుతుంది అని తెలిపారు.
ముఖ్యంగా ఏజెన్సీ వ్యవస్థ ద్వారా వారిని నిలువు దోపిడి చేస్తున్నారు అని తెలిపారు. మేము ఉద్యోగులము అయినప్పటికీ ఒక వస్తువు పై చెల్లించే మాదిరిగా స్టేట్ జిఎస్టీ మరియు సెంట్రల్ జిఎస్టీ వసూలు చేస్తున్నారు.వారికి వచ్చే జీతాలలో 40% ఏజెన్సీ వారే నిలువు దోపిడి చేసి మా దగ్గర నుండి తీసుకుంటున్నారు అని తెలిపారు. ఏజెన్సీ వ్యవస్థ ను రద్దు చేసి నేరుగా వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నారు.మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీ ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై చిన్న చూపు చూడకుండా వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..