-ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు మరియు గ్రామస్తులు
-గత మూడేళ్లుగా చెరువుకు బుంగపడుతుంటే మీరేం చేస్తున్నారు
-తూతూ మంత్రంగా మరమ్మత్తులు చేయకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలి
-స్థానిక నీటిపారుదల శాఖ అధికారుల పనితీరుపై మండిపడిన ఆ శాఖ సీఈ శ్రీనివాస్
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్దేవ్ పల్లి గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అత్యధికంగా 188 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినందున గ్రామంలో గల దాన్మన్ చెరువు పూర్తిస్థాయిలో నిండిపోయి చెరువు కట్టకు గండిపడడం వలన చెరువులో నుండి గండి ద్వారా నీరు వృధాగా బయటకు ప్రవహిస్తుంది. తద్వారా చెరువు కట్ట కింది భాగంలో పొలము కలిగి ఉన్న రైతులు మరియు గ్రామస్తులు నీటి ప్రవాహం వలన పంటలు మరియు చెరువు కట్ట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు అందించడంతో సంబంధిత శాఖ అధికారులు (సీఈ) శ్రీనివాస్, (ఈఈ) రాజశేఖర్, (డీఈ) జగధీష్ మరియు( ఏఈ )అజాం షరీఫ్ సంఘటన స్థలానికి వెళ్లి సమస్యను పరిశీలించారు. నీటిపారుదల శాఖ ఏఈ మరియు డిఈ ల విధి నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన (సీఈ) శ్రీనివాస్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా చెరువుకు బుంగపడుతుంటే మీరేం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం జెసిబి సహాయంతో బుంగ పడిన చోట మొరం పోయించి నామమాత్రంగా గండిని మూసేశారు. అయినప్పటికీ నీరు లీకేజీ మాత్రం ఆగడం లేదు.. నీటి ఒత్తిడి గండి పై పడకుండా ఉండడానికి అనవసరంగా చెరువు గేటును ఎత్తేసి నీటిని కిందికి వదిలేస్తున్నారు.వర్షాలు కురిసినప్పుడే నీటిని ఒడిసి పట్టుకోవడానికి చెరువులను ఏర్పాటు చేసుకుంటే అవి కాస్త ప్రజలకు ఉపయోగపడకుండా అధికారుల నిర్లక్ష్యానికి వృధా అవుతున్నాయని గ్రామస్తులు వాపోయారు.ఒకవేళ నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక గండి కృంగిపోయినట్లైతే చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన కురుమ భాస్కర్ అనే రైతు మాట్లాడుతూ కట్ట కింద తనకు పొలం ఉన్నదని.. గత మూడు సంవత్సరాల క్రితం చెరువు కట్టకు ఈ గండి పడిందని అప్పటినుండి నీటిపారుదల శాఖ అధికారులు ఏఈ మరియు డిఈ దాన్ని మరమ్మతులు చేయిస్తామని మాటలు చెబుతున్నారు తప్ప ఇప్పటివరకు దానిని పూర్తిస్థాయిలో మరమ్మత్తు చేయించలేదని వాపోయారు. గత సంవత్సరం వర్షాకాలంలో కూడా ఇదేవిధంగా గండిపడినప్పుడు రూ. 5 లక్షలతో మరమ్మత్తులు చేయిస్తామని చెప్పి ఇప్పటివరకు దాని ఊసే లేదన్నారు.గండి సరాసరి అతని పొలానికి ఎదురుగా పడటం వలన నీటి ఉధృతి ఎక్కువైనట్లయితే వరి పంట కరుగు పొట్ట దశలో ఉన్న తన పంట నీటిపాలవుతుందని తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మత్తులు చేయకపోవడం వలన ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందని సంబంధిత అధికారులపై రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి చెరువు కట్టకు పడిన గండిని పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయించి చెరువును మరియు పంట పొలాలను కాపాడాలని అధికారులను వేడుకున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








