V1News Telangana

best news portal development company in india

20వ సారి విజయవంతంగా రక్తదానం చేసి సేవా గుణాన్ని చాటుకున్న సంగం గ్రామ యువకుడు…..

SHARE:

కామారెడ్డి జిల్లా: ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజు బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో నసురుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామానికి చెందిన సునీల్ రాథోడ్, విజయవంతంగా 20 వ సారి రక్తదానము చేసి తన సేవా గుణాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 2015 సంవత్సరంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో మొదటిసారి రక్తదానం చేశానని తెలిపారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం రెండు లేదా మూడుసార్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ఒక మంచి అలవాటుగా మార్చుకున్నానని అన్నారు. తాను కేవలం రక్తాన్ని మాత్రమే దానం చేస్తున్నాను అనుకోకుండా సాటి మనుషుల జీవితాన్ని కాపాడడంలో పాలుపంచుకుంటున్నానని భావిస్తున్నట్లు తెలిపారు. సాటి మనుషులు అనారోగ్యంతో బాధపడుతూ ఆపదలో ఉన్నప్పుడు తన వంతు సహాయంగా రక్తదానం చేస్తున్నానని అన్నాడు. తనలాగే యువతరం అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేసినట్లయితే రక్తనిధి కేంద్రాలలో రక్తం కొరత ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మనం రక్తదానం చేయకపోయినప్పటికీ 120 రోజుల్లో మన దేహంలో ఉన్న ఎర్ర రక్త కణాలు నశించిపోతాయి అని అన్నారు. అందువల్ల యువత అందరూ సంఘటితంగా రక్తదానం చేస్తే ఎదుటి మనిషి జీవితాలను కాపాడిన వారవుతారని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు 20 సార్లు రక్తదానం చేసి సమాజ సేవలో పాలుపంచుకుంటూ నేటితరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నందున సునీల్ రాథోడ్ ను పలువురు అభినందించారు. ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india