కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని బిజెపి అధిష్టానం ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్ బిజెపి పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ,మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహం పేరుతో రెండు గంటల పాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ శాసన సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బిజెపి నాయకులు, కార్యకర్తలు ధ్వజమెత్తారు. ప్రభుత్వం వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ప్రకటిస్తామని చెప్పి రైతులను గాలికి వదిలేశారని అన్నారు . నీటి ఎద్దడి వల్ల పంటలు ఎండిపోతే పట్టించుకునే నాధుడు లేడన్నారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధుని రూ.15 వేలకు పెంచి ఇస్తామని మాట ఇచ్చి అసలు రైతులకు ఉన్న రైతుబంధు కూడా పంపిణీ చేయకుండా అలసత్వం వహిస్తుందని అన్నారు .అంతేకాక రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు కూలీలకు కూడా 12 వేలు వారి ఖాతాల్లో జమ చేయ్యాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు వడగండ్లు, వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకి రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి గ్యారెంటీలను అమలు చేయకపోతే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు లక్ష్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








