V1News Telangana

best news portal development company in india

రైతులకు శుభవార్త.. ఇంటి నుంచే యూరియా బుకింగ్ ఈ నెల 20 నుంచి మొబైల్ యాప్ ప్రయోగాత్మక అమలు

SHARE:

V1newstelangana:

రైతులు ఇకపై యూరియాను ఇంటి నుంచే బుక్ చేసుకునే సౌకర్యాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎరువుల పంపిణీలో పారదర్శకత పెంచడంతో పాటు రైతులకు ఇబ్బందులు తగ్గించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ మొబైల్ యాప్ ద్వారా రైతులు తమకు సమీపంలోని ఎరువుల డీలర్లతో పాటు జిల్లా పరిధిలోని అన్ని డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యతను తెలుసుకోవచ్చు. రైతు తన పంటలకు అవసరమైన యూరియాను ఏ డీలర్ నుంచైనా ముందుగానే బుక్ చేసుకుని కొనుగోలు చేయవచ్చు. అవసరమైతే యూరియా బుకింగ్ కోసం తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) సేవలను కూడా ఈ యాప్ ద్వారా వినియోగించుకునే అవకాశం కల్పించారు.
యూరియా బుక్ చేసిన అనంతరం రైతుకు ప్రత్యేకమైన బుకింగ్ ఐడీ నంబర్ లభిస్తుంది. ఆ బుకింగ్ ఐడీ ఆధారంగా రైతు తాను ఎంపిక చేసిన డీలర్ వద్ద నుంచి యూరియాను కొనుగోలు చేయవచ్చు. రైతు లేదా రైతు ప్రతినిధి వద్ద ఉన్న బుకింగ్ ఐడీతో పాటు బుక్ చేసిన పరిమాణాన్ని డీలర్ ధృవీకరించిన తరువాతే యూరియా విక్రయం జరగనుంది.
బుకింగ్ సమయంలో రైతులు సీజన్, పట్టాదార్ పాసుబుక్ నంబర్, తాము వేసిన పంటల వివరాలు, సాగు విస్తీర్ణాన్ని యాప్‌లో నమోదు చేయాలి. ఈ వివరాల ఆధారంగా రైతుకు అవసరమైన మొత్తం యూరియా పరిమాణాన్ని యాప్ స్వయంగా లెక్కిస్తుంది. పంట రకం, సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతుకు అవసరమయ్యే యూరియా బస్తాలను 15 రోజుల వ్యవధితో ఒకటి నుంచి నాలుగు దశలలో అందుకునేలా యాప్‌లో వివరాలు కనిపిస్తాయి.
పాసుబుక్ లేని రైతులు ఆధార్ నంబర్ ద్వారా ఓటీపీ ధృవీకరణ చేసి యూరియా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. కౌలు రైతులు కూడా తమ పేరు, తండ్రి పేరు, ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ధృవీకరణ అనంతరం భూ యజమాని పట్టా పాసుబుక్ నంబర్ ఎంటర్ చేస్తే, యజమాని మొబైల్ నంబర్‌కు ఓటీపీ వెరిఫికేషన్ చేసి యాప్‌ను వినియోగించుకోవచ్చు.
ఇక డీలర్లు తమ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి రోజువారీగా వారికి వచ్చిన స్టాక్, అమ్మకాల వివరాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లతో కూడిన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను కూడా వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india