– రంగురంగుల పూలతో బతుకమ్మలను ముస్తాబు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు
– సాక్షాత్తు అమ్మవారే దర్శనమిచ్చినట్లుగా వేషధారణలో ఒళ్ళు గగుర్పొడిచేలా అలరించిన చిన్నారుల ప్రదర్శనలు
– చదువులు, క్రమశిక్షణ తో పాటు భావితరాలకు మన పండగల యొక్క ప్రాధాన్యతను అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించిన యాజమాన్యం
– శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాల హెడ్ మాస్టర్ చందన
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా,V1న్యూస్ సెప్టెంబర్ (22):నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో ప్రభుత్వం పండగ సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం రోజు విద్యార్థులకు ముందస్తుగా బతుకమ్మ మరియు దసరా పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని,విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అందరూ సాంప్రదాయబద్ధంగా నూతన వస్త్రాలను ధరించి పండగ సంబరాలలో పాల్గొన్నారు. విద్యార్థినిలు భక్తిశ్రద్ధలతో రంగురంగుల పువ్వులను సేకరించి అందంగా బతుకమ్మలను ముస్తాబు చేసి పూజించారు. పాఠశాల ఆవరణలో అందమైన రంగవల్లులను చిత్రీకరించి అందులో బతుకమ్మలను ప్రతిష్టించి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ కలిసి ,మెలిసి ఎంతో ఉత్సాహంగా ఆనందోత్సాహాలతో, దాండియా నృత్యాలతో, ఆటపాటలతో మైమరచిపోయి అలరించారు. అనంతరం విజయదశమి పండగ ఉత్సవాలలో భాగంగా విద్యార్థులు సాక్షాత్తు అమ్మవారు దర్శనమిచ్చినట్లుగా ఒళ్ళు గగుర్పొడిచేలా కన్నుల పండుగగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఉత్తమ ప్రదర్శనలు చేశారు. విద్యార్థుల ప్రదర్శనలను కాలనీవాసులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఆసక్తిగా తిలకిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ చందన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా పాఠశాలలో ఇదేవిధంగా ప్రతీ పండగలను ముందస్తుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరము కలిసి ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భక్తితో మహిళలు పువ్వులను పూజిస్తూ పండగ జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా ప్రజలందరూ దేవీ నవరాత్రులను ఎంతో నియమనిష్టలతో జరుపుకుంటారని అన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు, క్రమశిక్షణతో పాటు భావితరాలకు మన పండగల యొక్క ప్రాధాన్యతను తెలియజేయడానికి తమ వంతు ప్రయత్నాలను ప్రతి సంవత్సరం నిర్విరామంగా అమలు చేస్తున్నామని గర్వంగా తెలియజేశారు. మండల ప్రజలందరికీ ముందస్తుగా పండగల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








