Post Views: 85
*ఆగస్టు 23 శనివారం అమావాస్య సందర్భంగా…*
*కేవలం వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందేలా చేసే పర్వదినం పోలాల అమావాస్య. పోలేరమ్మ అమ్మవారు గ్రామ దేవత. దాదాపు ప్రతి ఊరి పొలిమేర్లలో అమ్మవారు కొలువుదీరి పూజలందుకుంటూ ఉంటుంది. పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని, సంతానం కలిగిన వారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజస్తూ వ్రతం చేసే పర్వదినమే పోలాల అమావాస్య.*
*శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అమావాస్య “పోలాల అమావాస్య”. దీనికే ‘పోలా అమావాస్య’, ‘పోలాలమావాస్య’, ‘పోలాంబవ్రతం’ వంటి పేర్లు కూడా ఉన్నాయి. పోలాల అమావాస్య ఆచరణ వెనుక ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఏడుగురు కుమారులు కలిగారు. యుక్త వయస్సు రాగానే* *వారందరికీ వివాహాలు చేశారు. వారికి సంతానం కూడా కలిగింది. గ్రామంలో విడివిడిగా నివసించసాగారు. తమ సంతానం బాగా ఉండాలంటే ‘పోలాంబ’ అమ్మవారిని శ్రావణమాసంలో అమావాస్యనాడు పూజిస్తూ వ్రతం చేయాలని విన్న ఆ ఏడుమంది శ్రావణమాసం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణమాసం వచ్చింది. అనేక వ్రతాలు ఆచరించారు. చివరి రోజు అయిన అమావాస్యనాడు పోలాంబ వ్రతం ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వ్రతం రోజు ఉదయాన్నే ఏడవ కోడలి కుమారుడు మరణించాడు. అందువల్ల వ్రతం చేయలేకపోయారు. మరుసటి సంవత్సరం వ్రతం చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ ఆ సంవత్సరమూ ఏడవ కోడలి మరో బిడ్డ మరణించింది. దీనితో వ్రతం చేయలేక పోయారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం… ఆ రోజు ఉదయం ఏడవ కోడలి బిడ్డ మరణించడం వ్రతం చేయలేకపోవడం… ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగింది. మిగతా ఆరుమంది. కోడళ్ళు ఏడవ కోడలి వల్ల వ్రతం చెడిపోతూవుంది అని తిట్టుకోసాగారు. ఆమెకు ఎక్కడలేని దుఃఖం కలుగుతూ ఉండేది. మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదవ సంవత్సరం వ్రతానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. అయితే ఆ రోజు ఉదయమే ఏడో కోడలి బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని, వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని, కోప్పడతారని భయపడ్డ ఆమె తన బిడ్డ మరణించిన విషయాన్ని బయటకు చెప్పకుండా… చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంటిలోవుంచి తోడి కోడళ్ళతో కలిసి వ్రతంలో పాల్గొంది. అందరూ ఆనందంలో వ్రతం చేస్తూవున్నా… తాను మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంది. రాత్రి వరకూ అలాగే గడిచింది. చీకటి పడి గ్రామం సద్దుమణిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ పొలిమేరలో ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుని, గుడిముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి, తన పరిస్థితిని తలుచుకుని దుఃఖించ సాగింది.*
*ఇట్టిస్థితిలో పోలేరమ్మ అమ్మవారు గ్రామసంచారం ముగించుకుని అక్కడికి చేరుకుని ఆమెను చూసి, ఆ సమయంలో ఏడుస్తూ తన వద్ద కూర్చునడానికి కారణం అడిగింది. దీనితో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది. వీటన్నింటిని విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు ఇచ్చి పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలువమని చెప్పింది. ఏడవ కోడలు అదేవిధంగా చేసింది. ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్రనుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు. వారందరినీ తీసుకుని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంది. మరునాడు ఉదయం గ్రామంలోని వారందరికి ఈ విషయం వివరించింది. అందరూ సంతోషించారు. అంతేకాకుండా అప్పటినుంచీ అందరూ ప్రతి సంవత్సరం వ్రతం చేయడం ప్రారంభించినట్లు కధనం.*
*వ్రతం రోజు తెల్లవారుఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకుని మహిళలు తమ పిల్లలను వెంటబెట్టుకుని పోలేరమ్మ ఆలయానికి వెళ్ళి పూజలు చేసి ఇంటికి చేరుకుని వ్రతం చేయవలెను. పసుపుతో పోలేరమ్మను చేసుకుని పూజ చేయదలచిన చోట ఏర్పాటు చేసుకున్న పీఠంపై బియ్యంపోసి దానిపైన ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత అమ్మవారిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించాలి. సాధారణంగా గౌరీదేవిని పూజచేస్తారు. పూజ ముగించిన తర్వాత పసుపు రాసిన దారానికి పసుపు కొమ్మును కట్టి ‘తోరము’ తయారు చేసుకుని పూలతో పూజించాలి. తోరమును ఒక దానిని అమ్మవారికి సమర్పించాలి. మిగతా తోరములను పిల్లల మెడలో వేయాలి. తర్వాత ‘పెరుగన్నము’ నైవేద్యంగా సమర్పించడంతోపాటూ ఆ రోజు దానినే ఆహారంగా స్వీకరించాలి. తిరిగి సాయంత్రం, మరునాడు పూజచేసి వ్రతం ముగించాలి.*
*ఈ విధంగా వ్రతం ఆచరించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానానికి అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని శాస్త్ర వచనం.*
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








