– రేషన్ కార్డుల జారీపై కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రశంసల జల్లు కురిపించిన ఎమ్మెల్యే
– ప్రజల సుదీర్ఘ కాలం నిరీక్షణ నెరవేరిందని సంతోషం వ్యక్తం
– గ్రామాలలో ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని నాయకులకు సూచనలు
– దొంగ పట్టాలపై కొరడా ఝలిపించాలని సబ్ కలెక్టర్ కు ఆదేశాలు జారి
– బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి….
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో శనివారం రోజు రెడ్డి సంఘం హాలులో నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును మంజూరు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి ప్రజా ప్రభుత్వమని రుజువు చేసుకుందని కొనియాడారు.. చాలామంది ప్రజలు రేషన్ కార్డు లేకపోవడం వల్ల సంవత్సరాల తరబడి నిరీక్షించారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడం పట్ల అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాలలో పక్కా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించాలని స్థానిక నాయకులకు సూచించారు. అదేవిధంగా గ్రామాలలో ప్రభుత్వ భూములను గుర్తించి తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఆ భూములను చదును చేయించి పేద ప్రజలకు ఇల్లు నిర్మించి ఇచ్చే విధంగా ముఖ్యమంత్రితో చర్చించి పేదల కలను నెరవేర్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా చాలా గ్రామాలలో ప్రభుత్వ భూములను కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకొని దొంగ పట్టాలను సృష్టించుకుని అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అలాంటి దొంగ పట్టాలు కలిగిన ప్రభుత్వ స్థలాలను గుర్తించి కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా రద్దుచేసి స్వాధీనం చేసుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి కి ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ భూమిని గుర్తించి నిజమైన నిరుపేద కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, బీర్కూర్ తహసిల్దార్ లత, నసురుల్లాబాద్ తహసిల్దార్ సువర్ణ , ఆర్ఐ వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








