– ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్న గిరిజనులు
– సాంప్రదాయ నృత్యంలో అలరించిన బంజారాలు
– నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహణ
– జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్
– తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని లింగంపల్లి , బొప్పాస్ పల్లి , ఫకీరా నాయక్ తాండ లకు చెందిన గిరిజన సోదర, సోదరీమణులు శనివారం రోజు అందరూ కలిసి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించి.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు, హోమం కార్యక్రమాలు పల్లకి సేవ నిర్వహించి పండుగలా జరుపుకున్నారు. ఒకరికొకరు పరస్పరం మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. సాంప్రదాయ దుస్తులలో ఎంతో ఆనందంగా ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏఎంసీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, మాజీ ఎంపీపీ పాల్త్య విట్టల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.

అనంతరం గిరిజనులందరూ కలిసి నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవం, గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి తమ అభివృద్ధికి తోడ్పడినట్లే.. సేవాలాల్ మహారాజ్ మా గిరిజనులలో చైతన్యం కలిగించి, ఐక్యమత్యంగా ఉన్నత స్థాయికి చేరే విధంగా మార్గదర్శకులు అయ్యారని కొనియాడారు.

గతంలో మా గిరిజన సోదరులు అటవీ ప్రాంతంలో, వలస జీవులుగా, ఎటువంటి మౌళిక వసతులు లేకుండా దుర్భర జీవితాలను గడిపారని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వాలు కనీసం గిరిజనులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి వలన ఈరోజు గిరిజన జాతి ప్రజలందరూ ఆత్మగౌరవంతో , అన్ని రంగాలలో రాణిస్తున్నారని గర్వంగా తెలిపారు.

అనంతరం వారు సేవాలాల్ మహారాజ్ జయంతి దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ ఎల్. ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో విట్టల్ రాథోడ్, బలరాం సింగ్, సవాయి , దేవి సింగ్, అశోక్ రాథోడ్, మోహన్ నాయక్, ప్రేమ్ సింగ్, పీర్యా నాయక్, తారా సింగ్, గణేష్, లక్ష్మణ్ సింగ్, పెర్మల్ రాథోడ్, రవి రాథోడ్, గిరిజన పెద్దలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








