– రైతు భరోసా విషయంలో రూటు మార్చిన ప్రభుత్వం
– ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజల మనోభావాలతో ఆటలా
– పనికిమాలిన నిబంధనలతో కాలయాపన
– బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్
– బిఆర్ఎస్ పార్టీ మండల యువ నాయకులు యండి. అఫ్రోజ్
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రోజు కేటీఆర్ ఆదేశాల మేరకు..బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి.. నిరసన తెలిపారు. ఈ క్రమంలో వారు గోడప్రతులను అతికించి, కరపత్రాలను ప్రజలకు పంచి పెడుతూ ప్రభుత్వం అమలు చేసే వ్యతిరేక విధానాలను వారికి వివరించారు.ఈ సందర్భంగా మండల సీనియర్ నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్ మరియు మండల యువ నాయకులు యండి. అఫ్రోజ్ మాట్లాడుతూ.. రైతు భరోసా పథకం విషయంలో కాంగ్రెస్ పార్టీ రూట్ మార్చి మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆచరణ సాధ్యం కానీ ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని వాగ్దానం చేసి ఈరోజు మాట తప్పారని గుర్తు చేశారు.

రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.15000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రూ. 12000 వేలు ఇస్తామని చెప్పడం.. రైతులను నయవంచన చేయడమే అని అన్నారు. పట్టాదారులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి సర్కార్ యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటినుండి ఏడాది పాటు సర్వేల పేరిట కాలయాపన చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కొర్రీలు, కోతలు పెడుతున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని కుదించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు గుండె కోతను మిగిల్చిందన్నారు. మాయమాటలు చెబుతూ ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు చెల్లించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా విషయంలో మాట తప్పినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ వైఖరి మార్చుకునేంతవరకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులకు మద్దతుగా అలుపెరగని పోరాటం ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకట్, టేకుర్ల సాయిలు, కురుమ గంగారాం, మంగలి సాయికుమార్, చుంచు శేఖర్, మోసిన్, అల్లం గంగారాం, రమేష్, గంపల శంకర్, మామిడి బాలు, రైతులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








